ఏఐతో ప్రపంచ వేదికపై చెన్నూరు యువకుడు
చెన్నూరు యువకుడు ప్రపంచ టెక్నాలజీ వేదికపై తన ప్రతిభ చాటాడు. కృత్రిమ మేథస్సు ఆధారిత బీమ్‌ఫార్మింగ్ సాంకేతికతపై వినూత్న పరిశోధన చేసి అమెరికాలో పీహెచ్.డి. పట్టా అందుకున్న సాయి సంప్రీత్… వైర్‌లెస్ కమ్యూనికేషన్ రంగంలో భవిష్యత్ 5జీ, 6జీ వ్యవస్థలకు కొత్త దిశను చూపే పరిశోధనతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. సిమ్యులేషన్‌లకే పరిమితమైన పరిశోధనను ప్రత్యక్ష హార్డ్‌వేర్‌పై విజయవంతంగా నిరూపించి అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈ చెన్నూరు యువకుడి విజయగాథపై నాంది న్యూస్ ప్రత్యేక కథనం…
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన ఇందారపు సాయి సంప్రీత్ అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం నుంచి 2026 బ్యాచ్‌లో పీహెచ్.డి. పట్టా అందుకున్నాడు. సుధాకర్, సుధారాణి దంపతుల కుమారుడైన సాయి సంప్రీత్, తదుపరి తరం వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి కీలకమైన ఏఐ ఆధారిత బీమ్‌ఫార్మింగ్ అంశంపై వినూత్న పరిశోధన చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. బీమ్‌ఫార్మింగ్ సాంకేతికత ద్వారా వైర్‌లెస్ సిగ్నల్‌ను అన్ని దిశల్లో కాకుండా అవసరమైన వినియోగదారుని దిశలోనే కచ్చితంగా ప్రసారం చేయవచ్చు. ప్రస్తుతం 5జీ, 6జీ నెట్‌వర్క్‌లు, ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆధునిక రక్షణ సాంకేతికతల్లో ఈ విధానం కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా బీమ్‌ఫార్మింగ్‌పై జరుగుతున్న చాలా పరిశోధనలు కంప్యూటర్ సిమ్యులేషన్‌లకే పరిమితమవుతుండగా… సాయి సంప్రీత్ మాత్రం వాటిని ప్రత్యక్ష హార్డ్‌వేర్‌పై విజయవంతంగా అమలు చేసి ప్రత్యేకత చాటుకున్నాడు. కృత్రిమ మేధస్సు సహాయంతో యాంటెన్నా సెట్టింగ్‌లను ఖచ్చితంగా అంచనా వేసే విధానాన్ని అభివృద్ధి చేశాడు. తక్కువ వ్యయంతో సాఫ్ట్‌వేర్ డిఫైండ్ రేడియో పరికరాలను ఉపయోగించి స్వయంగా మాడ్యులర్ హార్డ్‌వేర్ టెస్ట్‌బెడ్ నిర్మించారు. అనంతరం అత్యాధునిక అనెకోయిక్ ఛాంబర్‌లో తన ఏఐ ఆధారిత విధానాన్ని పరీక్షించి, వాస్తవ పరిస్థితుల్లోనూ దాని సామర్థ్యాన్ని విజయవంతంగా నిరూపించాడు.
సాయి సంప్రీత్ సాధించిన ఈ ఘనతతో చెన్నూరులో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పట్టణ ప్రజలు ఆయనను అభినందించారు. టెక్ మహీంద్రా డైరెక్టర్ కొమ్మెర గిరీష్ కుమార్, కొమ్మెర అరుణ్ కుమార్, మాజీ చెన్నూరు మండల జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ లాహోటి, బెల్లంకొండ కరుణసాగర్ రావు, మంజుల రాజేశ్వర్, సంకేత్ తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాయి సంప్రీత్ విజయం చెన్నూరు యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
చిన్న పట్టణం నుంచి ప్రపంచ స్థాయి పరిశోధనల వరకు… ప్రతిభకు హద్దులు లేవని మరోసారి నిరూపించారు చెన్నూరుకు చెందిన ఇందారపు సాయి సంప్రీత్. ఆయన విజయం యువతకు స్ఫూర్తిగా నిలవడమే కాకుండా, భారతీయ యువ శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.