పిలిచారు… అవమానించారు…
-జర్నలిస్టులను అవమానించిన డీసీసీ అధ్యక్షుడు
-అందరి ముందు ఆగ్రహం.. అనంతరం సారీ...
-గతంలోనూ మీడియాపై ఆయన వైఖరి అదే
-ఇప్పటికైనా మార్చుకోవాలంటున్న జర్నలిస్టు సంఘాలు
ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. సొంత పార్టీలో నేతలు తిట్టుకుంటున్నారు.. ఏకంగా డీసీసీ అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డౌన్ డౌన్ నినాదాలు చేస్తున్నారు. దీంతో కోపం వచ్చింది… ఏం చేయాలో అర్థం కాలేదు… ఆయనకు ఎదురుగా జర్నలిస్టులు కనిపించారు. వెంటనే తన ఆగ్రహాన్నంతా వారిపై చూపించారు. అసలు మీరెవరు..? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటూ కారాలు మిరియాలు నూరారు. అదే కోపంతో చేతిలో ఉన్న మైక్ తీసుకుని మరి జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో సర్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రోటోకాల్ ప్రకారం తన ఫొటో లేదంటూ తాండూరు గ్రామ సర్పంచ్ ముడిమడుగుల సురేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం తన ఫొటో ఉండాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగానే తొలగించారని సర్పంచ్ ఆరోపించారు. ఈ విషయంపై డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డిని నేరుగా ప్రశ్నించడంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. సర్పంచ్‌కు మద్దతుగా ఆయన అనుచరులు, స్థానిక నాయకులు కూడా ఆందోళనకు దిగారు. మండల అధ్యక్షుడు శంకర్, డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి కావాలనే దళిత సర్పంచ్‌ను అవమానించారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ “డౌన్ డౌన్” అంటూ నిరసన వ్యక్తం చేశారు.
ఇదంతా ఇటు జరుగుతుండగా, డీసీసీ అధ్యక్షుడికి ఏం చేయాలో పాలు పోలేదు. దీంతో ఎదురుగా ఉన్న జర్నలిస్టులను ఉద్దేశించి “మీరు ఎవరు..? ఎందుకు వచ్చారు. ?” అంటూ ప్రశ్నించారు. ఇది అంతర్గత సమావేశమని… ప్రెస్‌ని లోపలికి రమ్మని ఎవరూ చెప్పలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటికి రెండు ఆయన తాము విలేకరులను పిలవలేదంటూ చెప్పారు. అయితే, ఆ సమావేశానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆహ్వానం ఉండగా, స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు సైతం విలేకరులను సమావేశానికి పిలిచారు. ఇది తెలియకుండా ఏకంగా డీసీసీ అధ్యక్షుడు జర్నలిస్టులను అవమానించడం గమనార్హం.
ఇక తాండూరు జరిగిన ఘటన పెద్దదవుతుందని భావించిన డీసీసీ అధ్యక్షుడు కొందరు పాత్రికేయులను కలిసి క్షమాపణలు చెప్పారు. తాను సమావేశం కంట్రోల్ చేయాలనే తపనలో ఎమోషనల్ గా అలా మాట్లాడానే తప్ప పాత్రికేయులపై ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పారు.