బెల్లంపల్లిలో కప్పతల్లి ఆటలు
సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బూదాకుర్ధు గ్రామంలో బుధవారం గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలు నిర్వహించారు.
ఇటీవల సరైన వర్షాలు లేక విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, వరుణ దేవుడి కరుణ కోసం గ్రామంలో ఈ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం నుంచే మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కప్పతల్లిని అలంకరించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. ప్రతి ఇంటి ముందు మహిళలు నీళ్లు పోసి కప్పతల్లికి స్వాగతం పలికారు.
అనంతరం గ్రామ దేవతల ఆలయాల్లో పాలు, నీటితో జలాభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. కప్పతల్లి ఆటలు నిర్వహిస్తే వాన దేవుడు ప్రసన్నమై సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనే నమ్మకం పూర్వకాలం నుంచి వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు.