రైలెక్కుతున్న రేషన్ బియ్యం
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం. అక్రమార్కులకు బంగారు గనిగా మారిందా..? రోడ్డు మార్గాల్లో నిఘా పెరగడంతో రేషన్ మాఫియా కొత్త ఎత్తుగడలకు తెర లేపిందా..? ఏకంగా రైళ్లనే అక్రమ రవాణాకు అడ్డాగా మార్చుకుని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారా..? అవుననే సమాధానం వస్తోంది.. మంచిర్యాల జిల్లాలోని పలు రైల్వేస్టేషన్ల నుంచి బియ్యం అక్రమ రవాణా సాగుతోంది.
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యం. అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. రోడ్డు మార్గాల్లో తనిఖీలు పెరగడంతో రేషన్ మాఫియా ఇప్పుడు రూట్ మార్చింది. గతంలో రైళ్ల ద్వారా బియ్యం తరలించిన స్మగ్లర్లు ఇప్పుడు కూడా తిరిగి అదే పద్ధతిలో రైళ్ల ద్వారానే పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్రలోని వీరూరుకు తరలిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని రవీంద్రఖని, మందమర్రి, రేచిని రైల్వేస్టేషన్లలో ఈ బియ్యాన్ని రైళ్లలో ఎక్కించి రవాణా చేస్తున్నారు. కాజీపేట నుంచి బల్లార్షా, నాగ్‌పూర్ వెళ్లే ప్యాసింజర్ రైళ్లను ఇందుకోసం వాడుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేసే పీడీఎస్ బియ్యాన్ని కొందరు దళారులు గ్రామాల్లో లబ్ధిదారులు, కొంతమంది డీలర్ల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ 12 నుంచి 18 రూపాయాలకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. వీరూరులో 32 రూపాయలకు అమ్ముకుంటున్నారు. దాదాపు రెట్టింపు డబ్బులు వస్తుండటంతో వ్యాపారులు దీనిపై కన్నేశారు.
రహదారులపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తుండటంతో మాఫియా కొత్త మార్గాన్ని ఎంచుకుందనే ప్రచారం జరుగుతోంది. రైళ్లు వచ్చిన వెంటనే బియ్యం బస్తాలను బోగీల్లోకి ఎక్కించి, సీట్ల కింద లేదా లగేజీ రూపంలో మహారాష్ట్ర తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అక్కడ బియ్యాన్ని పాలిష్ చేసి, బ్రాండెడ్ సంచుల్లో ప్యాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మంచిర్యాల జిల్లాలో ఈ దందా విస్తృతంగా కొనసాగుతోంది. గతంలో రైళ్ల ద్వారా రవాణా జరుగుతున్న సమయంలో అటు రైల్వే పోలీసులు, ఇటు అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి వాటిని పట్టుకున్నారు. దీంతో రైళ్ల ద్వారా బియ్యం రవాణా ఆగిపోయింది. రోడ్డు మార్గాలపై అధికారులు నిఘా పెట్టడంతో మాఫియా రూటు మార్చి మళ్లీ రైళ్ల ద్వారా బియ్యం అక్రమ దందా కొనసాగిస్తున్నారు. పేదల కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యం అక్రమంగా రాష్ట్రాలు దాటుతున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, విజిలెన్స్, రైల్వే పోలీసు శాఖలు సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాయా లేదా అన్నది వేచి చూడాలి.