ఒడిషా నుంచి తెలంగాణకు..
-నైనీబ్లాక్ నుంచి 4 వేల టన్నుల బొగ్గు మోసుకొచ్చిన గూడ్స్ రైలు
-సాదర స్వాగతం పలికిన సింగరేణి డైరెక్టర్లు, కార్మిక సంఘం నేతలు
-ఎంతో సంతోషంగా ఉందన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Singareni:ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి మంచిర్యాల ఎస్టీపీపీకి మొదటిసారి బొగ్గు లోడుతో గూడ్స్ రైలు చేరుకుంది. దీనికి అధికారులు, కార్మిక సంఘం నేతలు సాదర స్వాగతం పలికారు. నైనీ బ్లాక్ నుంచి బొగ్గు సరఫరా ప్రారంభం కావడం సింగరేణి సంస్థకు కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ బొగ్గు సరఫరాతో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఇంధన లభ్యత మరింత బలోపేతం కానుండగా, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరా మరింత స్థిరంగా కొనసాగనుంది.
గూడ్స్ రైలుకు సింగరేణి డైరెక్టర్లు, కార్మిక సంఘం నేతలు జెండా ఊపి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో సందేశం పంపించారు. మొదటి గూడ్స్ రేకు బొగ్గు రావడం శుభ సూచకమన్నారు. సింగరేణి కాలరీస్‌కు సంబంధించినంతవరకు ఇది ఒక చారిత్రాత్మక సందర్భమని భట్టి స్పష్టం చేశారు. కార్మికులకు అభినందనలు తెలిపిన ఆయన… ఇప్పటికే బొగ్గు బ్లాక్‌లు సాధించుకోవడం కోసం కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.
పెరుగుతున్న రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచే ప్రక్రియ కొనసాగుతోందని. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట సింగరేణి ఉత్పత్తి పెంచుకోవడమే కాకుండా, నూతన కోల్ బ్లాకులను దక్కించుకునేందుకు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. ఇప్పటికే ‘తాడిచర్ల-2’ బ్లాక్ పొందాం… నైనీ కోల్ బ్లాక్‌ను ఆపరేషన్లోకి తీసుకువచ్చి బొగ్గును వెలికితీసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ మొదటి రైల్ రేక్ వస్తోందని వెల్లడించారు. అలాగే ఇటీవల మనుగూరు బ్లాక్ ను వేలంలో పాల్గొని దానిని కూడా దక్కించుకున్నాం. భవిష్యత్తులో మరిన్ని బ్లాకులను పొందటానికి సింగరేణి కాలరీస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని భట్టి విక్రమార్క వెల్లడించారు.