నిజానిజాలు తెలుసుకుని మాట్లాడండి

ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు

బ్యాంకు రుణాలు, అప్పుల చెల్లింపుల విషయంలో విపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ మంచిర్యాల పర్యటన సందర్భంగా చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని హితవు పలికారు. మంచిర్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తనపై వస్తున్న బ్యాంకు రుణాల ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వివరణ ఇచ్చారు. బ్యాంకు నుంచి 450 కోట్ల రూపాయల రుణానికి ఆమోదం లభించగా.. తాను కేవలం 109 కోట్ల రూపాయల రుణం మాత్రమే తీసుకున్నానని స్పష్టం చేశారు. తీసుకున్న రుణానికి సంబంధించి వడ్డీతో పాటు అసలు మొత్తాన్ని కూడా చెల్లించినట్లు తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందే తాను వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదిగానని.. తన వ్యాపార విలువ వెయ్యి కోట్ల స్థాయికి చేరిందని వివరించారు.

బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ మంచిర్యాల వచ్చిన సందర్భంగా తనపై అసత్య ఆరోపణలు చేయడం సముచితం కాదని ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ప్రజలను అసత్య ప్రచారాలతో మభ్యపెట్టాలని చూడటం అవివేకమని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, లక్షెట్టీపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, జిల్లా నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

You might also like