సింగరేణి రైలులో పీడీఎస్ బియ్యం పట్టివేత

సింగరేణి రైలును రేష‌న్ బియ్యాన్ని అక్రమ రవాణాకు అడ్డాగా మార్చుకుంటున్నార‌న్న విష‌యం తేట‌తెల్ల‌మైంది. రోడ్డు ర‌వాణాపై నిఘా ఎక్కువ కావ‌డంతో స్మ‌గ్ల‌ర్లు రైళ్ల ద్వారా రేష‌న్ బియ్యం ర‌వాణా చేస్తున్నారు. రాయితీపై పేదలకు అందించే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సిర్పూర్-టి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడింది. తనిఖీలను గమనించిన సంబంధిత వ్యక్తులు బియ్యాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-టి రైల్వే స్టేషన్‌లో పీడీఎస్ బియ్యం అక్రమంగా త‌ర‌లిస్తుండ‌గా ఆర్‌పీఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్‌పీఎఫ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీరామ్ మీనా, డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాజ్‌కుమార్, ఏఎస్ఐ ఆర్. దాసు సంయుక్త బృందంగా ఏర్పడి సిర్పూర్-టి రైల్వే స్టేషన్‌లో సింగరేణి రైలులో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 35 బస్తాల్లో నింపిన సుమారు 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. అయితే అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బియ్యాన్ని తరలిస్తున్నట్లు భావిస్తున్న సంబంధిత వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు.

దీంతో అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని ఎవరు తరలించారు..? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..? ఎక్కడికి తరలించేందుకు ప్రయత్నించారు..? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పరారైన వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ రాయితీపై పేదలకు అందించే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం, నిల్వ చేయడం లేదా దుర్వినియోగం చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

You might also like