బీసీ మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
-119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం
-ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
-100 శాతం సబ్సిడీపై ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేలు
- బీసీ మహిళల ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
Good news from the government for BC women:బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షా 19 వేల మంది బీసీ మహిళలకు ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనుంది. 100 శాతం సబ్సిడీతో అమలు చేయనున్న ఈ పథకానికి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) శ్రీకారం చుట్టారు.
బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’(‘Indiramma Sewing Machines for Every House’) పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో.. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున.. మొత్తం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు.
ఒక్కో కుట్టు మిషన్ విలువ 12 వేల రూపాయలు కాగా.. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 100 శాతం సబ్సిడీపై అందించనున్నారు. ఈ పథకానికి అర్హులైన బీసీ మహిళల నుంచి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ మహిళలకు ఈ పథకం ద్వారా ఇంటి నుంచే ఉపాధి పొందే అవకాశం కల్పించనున్నారు. అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, అలాగే కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల ప్రకారం ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడంతో పాటు.. కుట్టు మిషన్ల వినియోగంపై అవసరమైన శిక్షణను కూడా అందించనున్నారు. మొదటి దశలో 1.19 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కల్పించనున్న ప్రభుత్వం.. భవిష్యత్లో పథకాన్ని మరింత విస్తరించే దిశగా చర్యలు తీసుకోనుంది.
బీసీ మహిళలను కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా.. స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇంటి నుంచే ఆదాయం పొందేలా మహిళలకు అవకాశాలు కల్పించడంతో పాటు.. బీసీల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.