ప్రజలకు సతర్వ న్యాయం అందాలి
“ప్రతి ఒక్కరినీ గౌరవిద్దాం… సంతోషంగా జీవిద్దాం” అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్ పిలుపునిచ్చారు. మందమర్రిలో జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం నూతన భవనం, బెల్లంపల్లిలో సీనియర్ సివిల్ కోర్టు భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, అహంకారం, చిన్నచిన్న విషయాలే అనేక గొడవలకు కారణమవుతున్నాయని అన్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందేలా కేసుల పరిష్కారంలో వాయిదాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలని సూచించారు.
కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో నూతన కోర్టు భవనాల ప్రారంభంతో కేసుల పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, న్యాయమూర్తులు, న్యాయశాఖ అధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.