ఎమ్మెల్యే ఫొటో మిస్సింగ్… ఆందోళన
సొంత నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు అవమానం జరిగిందంటూ ఆయన వర్గం ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు ఏకంగా ఆ ఫ్లెక్సీ తొలగించాల్సి వచ్చింది. ఉట్నూర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఫొటో లేకపోవడం వివాదానికి దారితీసింది.
ఉట్నూర్ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఏకరూప దుస్తులు, కిట్ల పంపిణీ కార్యక్రమం కోసం ఐటీడీఏ అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే అందులో స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఫొటో లేకపోవడంతో ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో.. కార్యక్రమానికి ముందే సంబంధిత ఫ్లెక్సీని ఐటీడీఏ సిబ్బంది తొలగించినట్లు తెలుస్తోంది. సొంత నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు సన్మానించారు. వీరి వెంట ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మాజీ డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, శ్రీలేఖ, తదితరులు ఉన్నారు.