కార్మిక రంగానికి తీర‌ని ద్రోహం చేసిన AITUC

సింగరేణి బొగ్గు గని కార్మికుల ప్రధాన సమస్యలు, డిమాండ్లను పక్కనబెట్టి యాజమాన్యంతో స్పష్టత లేని ఒప్పందాలు చేసుకున్నామని AITUC నాయకత్వం కార్మిక రంగానికి తీవ్ర ద్రోహం చేస్తోందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) విమర్శించింది. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. కార్మికులను మభ్యపెట్టేందుకు అరకొర ఒప్పందాలను చూపిస్తున్నారని ఆరోపించిన ఆయ‌న‌.. ఒప్పందాల పూర్తి వివరాలు, సంబంధిత సర్క్యులర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికులకు ప్రకటించిన రూ.20 లక్షల పరిహారం.. బ్యాంకుల ప్రమాద బీమాకు అదనమా, లేక కంపెనీ పరిహారమా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు.

ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి.. ఇప్పుడు బోర్డులు సక్రమంగా నిర్వహించడం లేదని దుయ్య‌బ‌ట్టారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో 100 శాతం కార్మికులకు మెడికల్ అన్‌ఫిట్ ద్వారా న్యాయం జరిగితే, ఇటీవల కేవలం 10 నుంచి 15 శాతం మందినే అన్‌ఫిట్‌గా ప్రకటించడం దారుణమన్నారు. రెండున్నరేళ్లలో డిస్మిస్ అయిన కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వకుండా.. 100, 150 మస్టర్ల నిబంధనల పేరుతో 200 మందికి పైగా కార్మికులను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. డ్రిల్ బిట్లు, రెజిన్, సిమెంట్ క్యాప్సూల్స్, డాగ్ నైల్స్ వంటి ప్రాథమిక పనిముట్ల కొరత ఉన్నా.. PPE కిట్లను సాధించిన ఘనతగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు.

హైదరాబాద్‌లో నిర్మిస్తామన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఎప్పటికి అందుబాటులోకి తెస్తారో చెప్పాలని మిర్యాల‌ డిమాండ్ చేశారు. CPRMS కార్డుదారులైన రిటైర్డ్ కార్మికులకు ఉచిత ఇన్‌పేషెంట్ చికిత్సతో పాటు ఆపరేషన్లను కూడా ఉచితంగా చేయాలని కోరారు. బదిలీల్లో మూడేళ్ల నిబంధన రద్దు, మారు పేర్ల సవరణ, కాంట్రాక్ట్ కార్మికులకు ESI, EPF అమలు, 149 మంది పెండింగ్ డిపెండెంట్లకు ఉద్యోగాలు, Perksపై రికవరీ అయిన ఇన్‌కమ్ ట్యాక్స్ రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

TBGKS వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల మెడికల్ ఇన్వాలిడేషన్ విషయంలో AITUC యాజమాన్యంతో కుమ్మక్కై అన్యాయం చేసిందని ఆరోపించారు. KCR నాయకత్వంలోని గత ప్రభుత్వం కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని విస్మరిస్తే రాబోయే రోజుల్లో కార్మికులే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఈ పత్రిక సమావేశంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, కేంద్ర కోశాధికారి చెల్పురి సతీష్, నాయకులు దూట శేషగిరి, వాసార్ల జోసెఫ్, రొడ్డ సంపత్, మురళీకృష్ణ, నూతి రాజ్‌కుమార్, అనురాజ్, మల్లారెడ్డి, సునీల్, చండ్రు శ్రీనివాస్, జనగామ ప్రమోద్, పాషా రాజు తదితరులు పాల్గొన్నారు.

You might also like