అన్నా… రాఖీ కడతా…
సీఎం అపాయింట్‌మెంట్ కోరిన కొండా సురేఖ
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. రాఖీ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రికి రాఖీ కట్టేందుకు తనకు కొంత సమయం కేటాయించాలని ఆమె కోరారు.
ఇటీవల ఆమె చుట్టూ ముసిరిన వివాదం తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో నేరుగా భేటీ కానుండటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. వివాదం సద్దుమణిగిన తర్వాత జరుగుతున్న తొలి ముఖాముఖి సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. రాఖీ కట్టేందుకు సీఎం సమయం ఇస్తారా? ఇస్తే భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి? అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. కేవలం రాఖీ వేడుక మాత్రమే కాకుండా, తాజా పరిణామాలపై ముఖ్యమంత్రితో ఆమె చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ అపాయింట్‌మెంట్‌ను ఖరారు చేసిన తర్వాత భేటీకి సంబంధించిన స్పష్టమైన సమయం వెలువడనుంది.