గంటకు 5,600 ఇడ్లీలు… 3,600 పూరీలు

-మంచిర్యాలలో ‘అక్షయ పాత్ర’లా సిద్ధమవుతున్న కిచెన్‌
-గంటల్లో వేలాదిగా అల్పాహారాలు!

ఉదయం పూట వేలాది మంది విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మంచిర్యాలలో భారీ వంటశాల సిద్ధమైంది. ఒకే చోట నుంచి రోజుకు 50 వేల మందికి ఆహారం అందించే సామర్థ్యంతో నిర్మించిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ ఆగస్టు 31న ప్రారంభం కానుంది. మంచిర్యాల అగ్రికల్చర్‌ మార్కెట్‌ యార్డులోని మెడికల్‌ గోడౌన్‌లో ఏర్పాటు చేసిన ఈ అధునాతన కిచెన్‌.. ఇకపై మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని వేలాది మంది విద్యార్థులకు ఉదయాన్నే పోషకాహారాన్ని అందించనుంది.

ఒక్కసారి యంత్రాలు పనిచేయడం మొదలైతే.. ఉత్పత్తి వేగం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గంటలో 5,600 ఇడ్లీలు, 2,000 దోశలు, 3,600 పూరీలు తయారు చేయగల ఆటోమేటెడ్‌ యంత్రాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. సాంబార్‌, కూరలను రెండు గంటల్లో 5 వేల మందికి సరిపడేలా తయారు చేసే సామర్థ్యం ఉండగా.. కేవలం 40 నిమిషాల్లో వెయ్యి మందికి సరిపడే అన్నం సిద్ధమవుతుంది.

ఆకలి నుంచి ఆరోగ్యం వైపు..
ఈ కిచెన్‌ నుంచి 42,450 మంది పాఠశాల విద్యార్థులు, 6,654 మంది జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రతిరోజూ అల్పాహారం పొందనున్నారు. మొత్తం 49,104 మంది విద్యార్థుల కోసం ఈ వ్యవస్థ పనిచేయనుంది. నాణ్యత, పరిశుభ్రత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఫుడ్‌ ల్యాబ్‌, మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, RO వాటర్‌ ప్లాంట్‌, ఆటోమేటిక్‌ కూరగాయల వాషింగ్‌–కటింగ్‌ యూనిట్‌, బాయిలర్‌ ప్లాంట్‌, సెంట్రల్‌ గ్యాస్‌ బ్యాంక్‌ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు.

మెనూలోనూ మార్పు.. పోషకాహారానికి ప్రాధాన్యం.
సోమవారం ఇడ్లీ–సాంబార్‌, మంగళవారం పూరీ–ఆలూ కుర్మా, బుధవారం దోశ–చట్నీ, గురువారం ఉప్మా–చట్నీ, శుక్రవారం మిల్లెట్‌ ఇడ్లీ–సాంబార్‌, శనివారం బోండా–చట్నీ అందించనున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సూచనల మేరకు ఈ మెనూను రూపొందించారు.

ఒక కిచెన్‌.. మూడు జిల్లాలు.. 49 వేల మందికి అల్పాహారం!
17 మండలాల పరిధిలోని 691 ప్రభుత్వ పాఠశాలలు, 13 జూనియర్‌ కళాశాలలకు ఈ కిచెన్‌ సేవలు అందించనుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కూల్‌ బ్రేక్‌ఫాస్ట్‌ ప్రోగ్రాంలో భాగంగా నిర్మించిన ఈ కిచెన్‌కు హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ అమలు భాగస్వామిగా వ్యవహరిస్తుండగా, సింగరేణి సంస్థ CSR నిధులతో నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించింది. ఆగస్టు 31న జరిగే ప్రారంభోత్సవానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్‌రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది వంటగది కాదు.. ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థుల ఉదయాన్ని పోషకాహారంతో ప్రారంభించే భారీ ‘ఫుడ్‌ ఫ్యాక్టరీ’!

You might also like