కాంగ్రెస్ వైఫల్యాలపై ఊరూరా నిల‌దీద్దాం

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు… 1000 రోజుల అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ పిలుపునిచ్చారు. పార్టీ పిలుపు మేర‌కు సెప్టెంబర్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల విఫల పాలన పై బీఆర్ఎస్ పార్టీ వారం రోజులపాటు నిరసన వ్య‌క్తం చేయ‌నున్న‌ట్లు వెల్డంచారు. మంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ ఇంట్లో మంచిర్యాల కార్పొరేషన్, హాజీపూర్ మండలం ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి వెయ్యి రోజులవుతున్నా ఆ హామీల‌ను గాలికి వదిలేసింద‌న్నారు. వెయ్యి రోజులు పూర్తవుతున్న ఎందుకు హామీలు నెరవేర్చలేదని మనం ప్రజల తరఫున పోరాడాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుదాం అని విజిత్ పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా వారం రోజులు పాటు నిర్వ‌హించ‌నున్న నిరసనలపై నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

You might also like