కలెక్టర్ కుమార్ దీపక్‌కు విశిష్ట ప్రతిభా పురస్కారం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు రాష్ట్ర ప్రభుత్వం “విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026” ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 5న రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ కుమార్ దీపక్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడంలో మంచిర్యాల జిల్లా రాష్ట్రస్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచింది. 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 43 వేల 72 మంది విద్యార్థులు ఉండగా.. 2026–27లో ఈ సంఖ్య 45 వేల 626కు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే 2 వేల 554 మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 2024–25తో పోలిస్తే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 10.34 శాతం పెరిగింది.
జిల్లాలోని 282 ప్రభుత్వ పాఠశాలల్లో 10 శాతానికి పైగా అదనపు నమోదు సాధించారు. మందమర్రి, నస్పూర్, జైపూర్, హాజీపూర్, భీమారం మండలాల్లో కూడా 10 శాతానికి పైగా నమోదు పెరిగింది. మరోవైపు.. 4 వేల 346 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం.. ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది.
కలెక్టర్ కుమార్ దీపక్ మార్గదర్శకత్వంలో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా విద్యాధికారి పి. చంద్రయ్య, విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంఐఎస్, సీసీఓలు, సీఆర్‌పీల కార్యాచరణ.. నిరంతర పర్యవేక్షణ, సమష్టి కృషి ఈ విజయానికి కారణమయ్యాయి. దీంతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు “విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026” దక్కింది. ఈ అవార్డు కలెక్టర్‌తో పాటు జిల్లా విద్యాశాఖకు, మొత్తం మంచిర్యాల జిల్లాకు రాష్ట్రస్థాయిలో లభించిన ప్రత్యేక గుర్తింపుగా అధికారులు పేర్కొంటున్నారు.