ప్రభుత్వం తప్పు చేస్తే రైతులకు శిక్షా..?

హైదరాబాద్ లో కూర్చొని రేవంత్, పొంగులేటి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ప్ర‌భుత్వం త‌ప్పు చేస్తే రైతులు శిక్ష అనుభ‌విస్తున్నార‌ని, సీఎం బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు దుయ్య‌బ‌ట్టారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో బీఆర్ఎస్ సమర శంఖ సభ నిర్వ‌హించింది. ఈ సంర‌ద్భంగా ఆయ‌న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధిత రైతులతో హరీష్ రావు ముఖాముఖి నిర్వహించారు. వంశపారంపర్యంగా వస్తున్న తమ భూములను నిషేధిత జాబితాలో పెట్టడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేయగా… చింతలమానెపల్లికి చెందిన రైతులు తమ పేర్లను ఆ జాబితా నుంచి తొలగించాలని వినతిపత్రాలు అందజేశారు.

అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన హరీష్ రావు.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల ఎకరాల పేదల భూములను, ప్లాట్లను, ఇండ్లను నిషేధిత జాబితాలో పెట్టారని దుయ్య‌బ‌ట్టారు. ఒక్క సిర్పూర్ నియోజకవర్గంలోనే సుమారు 42 వేల ఎకరాలకు పైగా భూమిని 22ఏ లో చేర్చారని మండిపడ్డారు. కేసీఆర్ పేదలకు భూములు ఇస్తే, రేవంత్ రెడ్డి ఆ పేదల నోటికాడి ముద్దను లాక్కుంటున్నారని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు.

భూములను నిషేధిత జాబితాలో పెట్టడం ద్వారా రైతులకు ఎరువులు, బ్యాంక్ రుణాలు, రైతుబంధు, రైతుబీమా అందకుండా చేశారని ఆరోపించారు. 22ఏ గురించి మాట్లాడితే రైతులను కబ్జాదారులుగా చిత్రీకరిస్తున్నార‌ని అన్నారు. రేవంత్ రెడ్డి ఇల్లు రాత్రికి రాత్రే నిషేధిత జాబితా నుంచి ఎలా బయటకు వచ్చిందో, రైతుల భూములను కూడా అలాగే పట్టా భూములుగా మార్చాలని స్పష్టం చేశారు. ఎవరి భూమి కబ్జా చేయాలి, ఎవరిది గుంజుకోవాలి అన్న ఆలోచనలతోనే రేవంత్ పాలన సాగుతోందన్నారు. తప్పు చేసిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా నిషేధిత జాబితాలో పెట్టాలని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డికి 15 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో, ప్రభుత్వంపై నమ్మకం లేక కాంట్రాక్టర్లు టెండర్లు వేసేందుకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి భార్య కూడా 15 శాతం కమీషన్ అడుగుతోందని స్వయంగా ప్రజలే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వని కళ్యాణ లక్ష్మి, రైతుబంధు లాంటి పథకాలను గత ప్రభుత్వం అమలు చేసి చూపించిందని గుర్తుచేశారు.

రైతుల భూములకు పట్టాలు వచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపబోదని హరీష్ రావు తేల్చిచెప్పారు. వెంటనే 22ఏ జాబితా నుంచి రైతుల భూములను తొలగించకపోతే లక్షలాది మందితో సెక్రటేరియట్‌ను, జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మెప్పు కోసం రైతులను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న అధికారులను బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వదిలిపెట్టబోమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు చిన్నయ్య, దివాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

You might also like