ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది
ప్రజల భూములు కాపాడాల్సిన ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో భూములు, ఇళ్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవహారంపై పలువురు బాధితులు హరీశ్‌రావును కలిసి వినతిపత్రాలు అందజేశారు. తమ ఆస్తులను 22ఏ జాబితా నుంచి తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుగోలు చేసిన భూములు, ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు. 22ఏలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో పాటు బ్యాంకు రుణాలు కూడా పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ధరణికి 22ఏకి ఏం సంబంధం?
ధరణి వ్యవసాయ భూముల కోసం తీసుకొచ్చారని హరీశ్‌రావు పేర్కొన్నారు. పట్టణ కేంద్రాల్లోని ఇళ్లు, స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చడంలో ధరణిని తప్పుపట్టడం సరికాదన్నారు. హైదరాబాద్, మంచిర్యాల, సిద్దిపేటతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ఆస్తులు 22ఏ జాబితాలోకి వెళ్లాయని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చిందో వైట్‌పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి కార్మికులపై కక్ష సాధింపా?
సింగరేణి కార్మికుల నివాస ప్రాంతాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6,226 ఇళ్లకు పట్టాలు ఇచ్చామని హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం వాటిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. సింగరేణి కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందా అని ప్రశ్నించారు. మంచిర్యాలలో సుమారు 10 వేల ఇళ్లు, 5,500 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని హరీశ్‌రావు పేర్కొన్నారు. దీంతో వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.
కలెక్టరేట్ ముట్టడికి హెచ్చరిక
22ఏ నిషేధిత జాబితా నుంచి బాధితుల భూములు, ఇళ్లను తొలగించకపోతే పదివేల మంది బాధితులతో కలిసి మంచిర్యాల కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్‌రావు, చిన్నయ్య, నాయకుడు విజిత్ రావు తదితరులు పాల్గొన్నారు.