రేవంత్‌వి 420 మాట‌లు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు(Former Minister Tanniru Harish Rao) విమర్శించారు. వృద్ధులకు రూ.4,000 పింఛన్‌, కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్‌ పథకాలపై ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని గొల్లగూడెంలో ఏర్పాటు చేసిన వంట వార్పు కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత తన్నీరు హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ కాంగ్రెస్‌ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు.

వృద్ధులకు నెలకు రూ.4,000 పింఛన్‌ ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని హరీశ్‌రావు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలం గడిచినా హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది సుమారు 2 లక్షల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశామని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 80 వేల చెక్కులను మాత్రమే అందించిందని ఆయన ఆరోపించారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు.

ఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తీరును ప్రజలు గమనిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్య‌క్ర‌మంలో బెల్లంప‌ల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య, బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

You might also like