ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓపై కేసు నమోదు
నిర్మల్ జిల్లా ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) గంటల శ్రీనివాస్ రెడ్డిపై కడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితుడు బనావత్ రెడ్డి నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఆర్ఓపై సెక్షన్ 294(b) BNS, 3(1)(s) SC/ST అట్రాసిటీ చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉడుంపూర్ గ్రామానికి చెందిన రైతు బనావత్ రెడ్డి నాయక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గత నెల ఆగస్టు 1న తన పొలంలో దున్నేందుకు ట్రాక్టర్‌ను తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో ఎఫ్బీఓ (FBO) పరమేశ్వర్ అడ్డుకున్నారు. ROFR భూమిలో ట్రాక్టర్‌తో దున్నడానికి అనుమతి లేదని చెప్పి ఆయనను నిలిపివేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు రెడ్డి నాయక్ తన తోటి రైతులతో కలిసి ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న ఎఫ్ఆర్ఓ గంటల శ్రీనివాస్ రెడ్డి రైతుల సమస్యను వినకుండా వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషిస్తూ, “మీకు దిక్కున్న చోట చెప్పుకోండి” అంటూ బెదిరింపులకు దిగారు.
సమస్యను వివరించేందుకు రైతులు ప్రయత్నించగా.. “మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? మర్యాదగా ఇక్కడినుంచి వెళ్ళండి, లేకుంటే మెడలు పట్టుకొని బయటకు గెంటేయిస్తా” అంటూ వారిని తీవ్రంగా అవమానించారు. అటవీశాఖ అధికారి ప్రవర్తనతో మనస్తాపం చెందిన రైతులు, గ్రామ పెద్దలతో చర్చించిన అనంతరం కడెం పోలీసులను ఆశ్రయించారు. తమను కులం పేరుతో దూషించి, మానసిక క్షోభకు గురిచేసిన ఎఫ్ఆర్ఓపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.