“నన్ను అణిచివేస్తున్నారు”
రాహుల్‌కు కొండా సురేఖ లేఖ
Konda Surekha Letter To Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తనపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకునే ముందు మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సంచలన లేఖ రాశారు. తనను రాజకీయంగా, పరిపాలనాపరంగా అణిచివేస్తున్నారని ఆరోపించిన ఆమె.. తన వాదనకు సంబంధించిన ఆధారాలు, వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను కూడా లేఖతో పాటు పంపినట్లు పేర్కొన్నారు. అనంతరం తనపై చర్యలు తీసుకున్న తర్వాత ఈ లేఖలను ఆమె బహిర్గతం చేశారు.
సోనియా గాంధీకి లేఖ రాసిన మరుసటి రోజే.. ఆగస్టు 23న రాహుల్ గాంధీకి ఆరు పేజీల సమగ్ర లేఖ రాసినట్లు కొండా సురేఖ వెల్లడించారు. రాష్ట్రంలో బీసీ మహిళా మంత్రిగా తనకు జరుగుతున్న రాజకీయ, పరిపాలనాపరమైన వివక్షతో పాటు ప్రభుత్వంలో ఎదురైన అవమానాలను లేఖలో వివరించినట్లు తెలిపారు. 31 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానం, కాంగ్రెస్ పార్టీ పట్ల తన నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని తన ఆత్మగౌరవాన్ని కాపాడాలని రాహుల్ గాంధీని కోరారు. ఆరోపణలపై నిష్పాక్షిక, సమగ్ర విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
శాఖాపరమైన నిర్ణయాల్లో తనను పక్కన పెడుతున్నారని ఆమె ఆరోపించారు. మంత్రిగా ఉన్నప్పటికీ కీలక నిర్ణయాల్లో తనకు కనీస సమాచారం ఇవ్వడం లేదన్నారు. యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు విషయంలో తనను సంప్రదించలేదని, సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి నిధులను తనకు సమాచారం లేకుండానే ఆర్అండ్బీ శాఖకు బదిలీ చేశారని లేఖలో పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనల్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తన ఫొటోను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు.
మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంపైనా ఫిర్యాదు
తన మాజీ ఓఎస్డీ సుమంత్‌ను ముందస్తు సమాచారం లేకుండా తొలగించడంతో పాటు, అతడిని అరెస్ట్ చేసేందుకు మంత్రి నివాసమైన తన క్వార్టర్స్‌కు పోలీసులు రావడం తన పదవిని, గౌరవాన్ని కించపరచడమేనని సురేఖ పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిపై ఆధారాలు లేని మరో నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తన సొంత నియోజకవర్గమైన వరంగల్ తూర్పు అభివృద్ధి పనులకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని మంత్రి ఆరోపించారు. ఇతర నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ స్మార్ట్ సిటీ మోడల్ బస్‌స్టాండ్, బొందివాగు విస్తరణ వంటి కీలక పనులకు నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు.
కడియం శ్రీహరి సమీక్షపైనా అభ్యంతరం
సంబంధిత శాఖ మంత్రికి సమాచారం లేకుండానే ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారని సురేఖ లేఖలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పార్టీలో అందరికీ ఒకే విధమైన ప్రమాణాలు అమలు కావడం లేదని ప్రశ్నించారు.
“బీసీ మహిళా మంత్రినైనందుకే టార్గెట్”..
తాను బీసీ మహిళా మంత్రిని కావడం వల్లే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారనే భావన కలుగుతోందని కొండా సురేఖ ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబాన్ని రాజకీయంగా ఒంటరి చేసేందుకు కొందరు సమన్వయంతో దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్ నోటీసు ఇవ్వడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.
పక్కా ప్రణాళిక ప్రకారమే..
కొన్ని రోజులుగా తన కుటుంబాన్ని రాజకీయంగా ఒంటరి చేసేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు జరుగుతున్నాయని, తన మాజీ ఓఎస్డీపై తీసుకున్న చర్యలు కూడా అందులో భాగమేనని ఆమె ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలు, తనకు ఎదురైన పరిణామాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని రాహుల్ గాంధీని కోరినట్లు కొండా సురేఖ లేఖలో పేర్కొన్నారు. తాజాగా ఆమెపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ లేఖలు వెలుగులోకి రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.