దళిత ద్రోహి రేవంత్ రెడ్డి:

బీజేపీ ఎస్సీ మోర్చాజిల్లా అధ్యక్షులు చిలుముల శ్రీకృష్ణ దేవరాయలు ధ్వజం

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు చిలుముల శ్రీకృష్ణ దేవరాయలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా  పిలుపు మేరకు తాండూరు మండలం మాదారంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో నిరసన చేపట్టారు. ​బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసి, సంత్ రవిదాస్ మహారాజ్ చిత్రపటంపై కాంగ్రెస్ కార్యకర్తలు నలుపు రంగు చల్లి అవమానించడం దారుణమని మండిపడ్డారు. ఇది యావత్ ఎస్సీ సమాజ మనోభావాలను దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు.

సంత్ రవిదాస్ మహారాజ్ చిత్రపటాన్ని అవమానించిన వారిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వెంటనే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ అమలుపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఏయే హామీలకు ఎన్ని నిధులు కేటాయించి ఖర్చు చేశారో ప్రజల ముందుంచాలని… ఎస్సీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్నారు. ఎస్సీలకు ఇచ్చిన గృహాలు, భూమి, ఉద్యోగాలు, ఆర్థిక సాధికారత హామీలను కాలపరిమితితో అమలు చేయాలన్నారు.

​ఎస్సీ సమాజం ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడటం లేదని, రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగుతుందని శ్రీ కృష్ణ దేవరాయలు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్, జిల్లా కార్యదర్శి రామగౌని మహిధర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్, మండల కార్యదర్శి గాదె రాజేశం, మండల నాయకులు ఆవుల చందు, ఆనంద్, త్రినాథ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

You might also like