కాంగ్రెస్ అబద్దాలపై బీఆర్ఎస్ కన్నెర్ర…
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర చౌరస్తా నుండి మార్కెట్ రోడ్, బస్టాండ్ మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 420 ఫీట్ల ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ, కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ప్రజలకు పంచుతూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారిరువురూ మాట్లాడుతూ 100 రోజుల్లో నెరవేరుస్తామన్న 6 గ్యారంటీలు, 420 హామీలను 1000 రోజులు గడుస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. హామీలను గాలికి వదిలేసి, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులను బెదిరించడం, కొట్టడం, జైలుకు పంపించడమే మంచిర్యాల ఎమ్మెల్యే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జిల్లాకు ‘A1’ గా అభివర్ణించారు. అధికారులను, గుండాలను అడ్డుపెట్టుకుని ఆయన 500 కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు.
G.O.22A ద్వారా 10,332 ఇండ్లను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను దోచుకునేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యారని మండిపడ్డారు. కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు వాగ్దానం చేసిన తులం బంగారం కూడా ఇవ్వాలని, లేకపోతే మహిళలతో కలిసి చెక్కుల పంపిణీని అడ్డుకుంటామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 5 లక్షల రైతు బీమా ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రీమియం కూడా కట్టడం లేదన్నారు. జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి ‘A1’ అని, అన్ని వర్గాలను మోసం చేసిన ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అహంకార ధోరణి, దుర్మార్గపు పాలనను చూసి సొంత పార్టీ నేతలే ఎదురుతిరుగుతున్నారని తెలిపారు. అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలను సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల కుమార్తెలే ఎదిరిస్తున్నారని గుర్తుచేశారు.