కుటుంబ కలహాలు.. భార్యను హత్య చేసిన భర్త!
కుటుంబ కలహాలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అనుమానం, రోజువారీ గొడవలతో క్షణికావేశంలో ఓ భర్త కట్టుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నెన్నల మండల కేంద్రంలో తోట సబిత (35) అనే వివాహిత తన భర్త మల్లేష్‌తో కలిసి నివాసముంటోంది. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వివాదం తీవ్రరూపం దాల్చడంతో, ఆగ్రహానికి గురైన మల్లేష్ పదునైన ఆయుధంతో సబిత మెడ కోసి దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సబిత ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది.
విషయం తెలుసుకున్న వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్, బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్, నెన్నెల ఎస్సై జగదీశ్వర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు.
తల్లి హత్యకు గురికావడం, తండ్రి ఈ ఘాతుకానికి ఒడిగట్టడంతో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, భయాందోళనలను నింపింది.