టీటీడీ సంచలన నిర్ణయం.. భక్తులకు ఇన్సూరెన్స్!

-తిరుమల యాత్రికులకు రక్షణ కవచం ఏర్పాటు..
-తిరుమలలో సహజ మరణం సంభవిస్తే..
-దేశంలోనే తొలిసారిగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం..
-ప్రమాద బీమాను ఏకంగా రూ.10 లక్షలకు పెంచుతూ..
-టీటీడీ పాలకమండలి చారిత్రాత్మక నిర్ణయం!

కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (టీటీడీ) పాలకమండలి ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. తిరుమల కొండపై ఉన్న సమయంలో భక్తులకు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు సరికొత్త ఉచిత గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు నేతృత్వంలో బుధవారం అన్నమయ్య భవనంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మెగా ఇన్సూరెన్స్ పథకానికి అధికారికంగా ఆమోదం తెలిపారు.

సహజ మరణానికి కూడా రూ.2 లక్షలు
దేశంలోనే తొలిసారిగా టీటీడీ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. తిరుమల పర్యటనలో ఉండగా క్యూ కాంప్లెక్స్‌లు, ఘాట్ రోడ్లు లేదా గదులలో గుండెపోటు వంటి ఇతర సహజ కారణాల (Natural Death) వల్ల భక్తుడు మరణిస్తే.. ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.2 లక్షలు అందజేసే సరికొత్త వ్యవస్థను ఖరారు చేసింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ద్వారా ఈ ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం టీటీడీ తన సొంత నిధుల నుండి ఎల్‌ఐసీ సంస్థకు రూ.2.12 కోట్లను ప్రీమియం మొత్తంగా చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

ప్రమాద బీమా రూ.10 లక్షలకు పెంపు..
దీనితో పాటు ప్రమాదవశాత్తు తిరుమల పరిధిలో భక్తులు ప్రాణాలు కోల్పోతే అందించే బీమా మొత్తాన్ని కూడా భారీగా పెంచారు. ఇప్పటివరకు ఉన్న రూ.3 లక్షల పరిహారాన్ని ఏకంగా రూ.10 లక్షలకు పెంచుతూ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారితో పాటు, ఎలాంటి ముందస్తు టికెట్లు లేకుండా నేరుగా వైకుంఠం క్యూలైన్ల ద్వారా వెళ్లే సామాన్య భక్తులందరికీ కూడా రూపాయి ఖర్చు లేకుండా ఈ ఇన్సూరెన్స్ రక్షణ లభిస్తుందని టీటీడీ స్పష్టం చేసింది. నడక మార్గాలైన అలిపిరి, శ్రీవారి మెట్టు మరియు కొండపై ఉండే ప్రతి ఒక్క యాత్రికుడికి ఈ రక్షణ కవచం లభిస్తుంది.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు..
ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి అంగవైకల్యం బారిన పడిన బాధితులకు రూ.5 లక్షల వరకు, సాధారణ అత్యవసర చికిత్సల కోసం రూ.50 వేల వరకు ఉచిత వైద్య సాయం లభిస్తుంది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 48 కేటగిరీల టీటీడీ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచుతూ పాలకమండలి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీని తట్టుకోవడానికి వీలుగా ఏకంగా 10 లక్షల శ్రీవారి లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఎల్లప్పుడూ నిల్వ ఉంచాలని నిర్ణయించారు.

You might also like