అధికారుల తీరుపైనే అనుమానాలు…
రాస్తే రామాయణమంత…. చెబితే భారతమంత.. ఈ సామెత ఐసీడీఎస్ శాఖకు సరిగ్గా సరిపోతుంది… మరీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఐసీడీఎస్ అధికారుల అవినీతి గురించి చెబుతూపోతే అది ఒక్క రోజులో అయిపోదు. దీనికి ఉదాహరణే కోటపల్లి మండలం నక్కలపల్లి 1 సెంటర్లో జరిగిన అవినీతి… ఈ సెంటర్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ కోసం అధికారులు మంగళవారం విచారణ నిర్వహించారు. అయితే, ఈ విచారణలో గ్రామస్తులు అధికారులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అండ లేకుండా ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరగదంటూ నిలదీశారు.
వారం కిందట సూపర్వైజర్ విచారణ సూపర్వైజర్ సంధ్య విచారణ చేశారు. అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అందులో కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. పెండ్లి కాని మహిళకు పెండ్లి అయినట్లు… ఆమె గర్భవతి అయినట్లు, డెలివరీ సైతం అయినట్లు రికార్డుల్లోకి ఎక్కించింది అక్కడి అంగన్వాడీ టీచర్.. ఇలా చాలా రకాలుగా అవినీతికి తెరలేపారు. అయితే, అప్పుడు విచారణకు వచ్చిన సూపర్వైజర్ ఏం చెప్పకుండా తాను మళ్లీ వస్తానంటూ వెళ్లిపోయారు. టీచర్ పోషణ్ అభియాన్‌కు సంబంధించిన యాప్‌కు లాక్ ఉందని అది తెలియదంటూ వెళ్లిపోయారు. వాస్తవానికి ఎవరూ కూడా ఆ యాప్‌కు లాక్ వేయరు. ఒకవేళ ఏదైనా సమస్య ఉందని భావిస్తే ఖచ్చితంగా సూపర్వైజర్, సీడీపీవోల అనుమతి తీసుకుని లాక్ వేయాల్సిందే.
విచారణలో ఎన్నో ప్రశ్నలు…?
అయితే, విచారణ సందర్భంగా సూపర్వైజర్ తనకు లాక్ తెలియదని చెప్పడం వెనక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పెండ్లి కాని యువతి గర్భవతి అయిందని నమోదు చేసింది కూడా అందులో నుంచి తొలగించారు. మరి ఇందులో ఎవరి హస్తం ఉందనేది తెలియాల్సి ఉంది…? ఎట్టి పరిస్థితుల్లో ఉన్నతాధికారులకు తెలియకుండా ఇంత పెద్ద అవినీతి జరిగే అవకాశమే లేదని గ్రామస్తులు చెబుతున్నారు. కేవలం ఆ ఒక్కటే కాకుండా, ఆ టీచర్ నమోదు చేసిన వాటిల్లో దాదాపు 80 శాతం వరకు లబ్ధిదారులు లేరు. తమ బంధువులు, మనవరాలు ఇలా తెలిసిన వారందరి పేర్లు నమోదు చేసి సరుకులు స్వాహా చేశారు.
తనకు తెలియకుండా చేయడం అసాధ్యం…
విచారణ సందర్భంగా ఆ సెంటర్ కు సంబంధించిన టీచర్ తనకు తెలియకుండా ఇవన్నీ నమోదు చేశారని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, సాంకేతిక పరంగా అది అసాధ్యం… ఎందుకంటే ఎవరైనా లబ్ధిదారు పేర్లు నమోదు చేసేటప్పుడు సదరు టీచర్ సెల్‌ఫోన్‌కు, లబ్ధిదారుల సెల్‌ఫోన్‌కు దాదాపు పది వరకు ఓటీపీలు వస్తాయి. వేరే వాళ్ల సెల్‌ఫోన్ నుంచి తన సెంటర్ సంబంధించి లబ్ధిదారుల నమోదు చేసే అవకాశమే లేదు. వేరే వాళ్లను లబ్ధిదారులుగా చేర్చితే ఓటీపీల ద్వారా వ్యవహారం బయటపడుతుందని భావించిన ఆ అంగన్వాడీ సెంటర్ టీచర్ తెలివిగా బంధువుల పేర్లు నమోదు చేసి సరుకులు స్వాహా చేసింది. సరే ఒకవేళ తనకు తెలియకుండా వేరే సెల్ ఫోన్ నుంచి లబ్ధిదారుల పేర్లు నమోదు చేసి ఉంటే ప్రతి నెల సరుకులు తీసుకుంటున్నారు… కదా, తమ ప్రాంతంలో ఉన్న వ్యక్తులను తను గుర్తు పట్టలేదా..? ఇలా ఎన్నో ప్రశ్నలు…
అధికారులు ఏం చేస్తున్నట్లు..?
కోటపల్లి మండలం నక్కలపల్లి 1, బద్దంపల్లి సెంటర్ రెండూ కూడా మొదటి నుంచి వివాదస్పద సెంటర్లే. గతంలో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున పాలప్యాకెట్లు, కోడిగుడ్లు, సరుకులు తీసుకువెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు అధికారులు బలి అయ్యారు. సూపర్వైజర్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పటికైనా కొత్తగా వచ్చిన అధికారులు జాగ్రత్త పడాలి కదా..? కానీ, వారు జాగ్రత్త పడటం పక్కన పెడితే మరింత అవినీతికి ఊతమిచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీడీపీవో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు కొందరు అధికారుల మద్దతు కూడా ఉండటంతో చెన్నూరు ప్రాజెక్టు మొత్తం అవినీతిమయంగా మారింది. సరే అధికారులకు తెలియకుండా అవినీతి జరిగింది. మరి వారు నిత్యం సెంటర్లు సందర్శిస్తూ లబ్ధిదారులు ఎంత మంది వస్తున్నారు..? ఎవరెవరు వస్తున్నారు….? వారు అర్హులేనా..? కాదా..? ఇలా అన్నింటిని తనిఖీ చేయాల్సి ఉంటుంది… మరి చెన్నూరులో మాత్రం అలా జరగడం లేదు ఎందుకో..?
దుమ్మెత్తిపోసిన గ్రామస్థులు..
తాజాగా మంగళవారం(నిన్న) జరిగిన విచారణ సందర్భంగా మంచిర్యాలకు చెందిన సీడీపీవో, సూపర్వైజర్ సంధ్య హాజరయ్యారు. దీంతో గ్రామస్థులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కూతురుకు జరిగితే ఇలాగే చేస్తారా..? మీరు టీచర్లను కాపాడటానికి వచ్చారా..? మీ కెంత ముట్టాయో చెప్పండి..? మీ సెల్‌ఫోన్ ఇవ్వండి… ఫోన్‌పే, గూగుల్ పే చెక్ చేస్తామంటూ దుయ్యబట్టారు. అవినీతి, అక్రమాలు చేస్తున్న టీచర్లను కాపాడటానికి వచ్చారా..? అంటూ దుయ్యబట్టారు. విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిన అధికారులు విచారణ పేరుతో ఆలస్యం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవినీతిలో అధికారులకు సైతం పాత్ర ఉందని అందుకే కావాలని జాప్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. తలా ఒక్క మాట అంటూ సూపర్వైజర్ను దూషించడంతో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.
రాజకీయ ఒత్తిడికి ప్రయత్నాలు…
ఇదంతా ఇటు జరుగుతుండగానే కొందరు వ్యక్తులు మధ్య వర్తుల ద్వారా రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి డబ్బులు చెల్లిస్తామని, అధికారుల గురించి తమకు వదిలేయండంటూ మధ్య వర్తుల ద్వారా చెప్పిస్తున్నట్లు సమాచారం. గతంలో అంగన్వాడీ టీచర్‌ను కాపాడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేత ఒకరి ద్వారా ఉన్నతాధికారులకు చెప్పించి సమస్య సద్దుమణిగేలా చేయాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. మరి రాజకీయ నేతల ఒత్తిడికి అధికారులు తలొగ్గుతారా..? లేక అవినీతిపై చర్యలు తీసుకుంటారా..? అనేది వేచి చూడాల్సి ఉంది. అంగన్వాడీ టీచర్‌తో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్పై సైతం చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.