రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృత్యువాత
మంచిర్యాల జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని నస్పూర్ గేటు వద్ద వేగంగా వస్తున్న లారీ, ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువతులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇదే ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మందమర్రి మండలం గుడిపల్లికి చెందిన సౌందర్య, రవళి, రమ్య ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నారు. వీరంతా ఉదయం పనికి వెళ్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది. హఠాత్తుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయిన ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జుయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.