చెట్టుపైనే మొలకలు … విత్తన లోపంతో సోయా రైతుల విలవిల

అరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే పాడైపోతుంటే ఆ రైతుల గుండె తరుక్కుపోతోంది. చేతికొచ్చిందనుకున్న సోయా పంట.. వింతగా చెట్టుపైనే మొలకెత్తడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది ముమ్మాటికీ విత్తనాల లోపమేనని, అప్పుల పాలైన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నలు కదం తొక్కారు.

50 ఎకరాల్లో వింత పరిస్థితి.. వందల ఎకరాల్లో నష్టం
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో సుమారు 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సోయా చిక్కుడు కాయలు చెట్టుపై ఉండగానే మొలకలు వచ్చాయి. సాధారణంగా కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో కాయలు ఎండిపోయి గింజలు పక్వానికి రావాలి. కానీ, వింతగా కాయల్లోంచి పచ్చని మొలకలు బయటకు రావడంతో రైతులు కంగుతిన్నారు. కేవలం రుయ్యాడి గ్రామంలోనే కాకుండా.. జిల్లాలోని బండల నాగపూర్ ఇతర రూరల్ మండలాల్లో సైతం వందల ఎకరాల్లో సోయా పంట ఇలాగే దెబ్బతింది. వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి, పంట చేతికొచ్చే సమయానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.

కలెక్టరేట్ వద్ద అన్నదాతల ఆందోళన
పంట చెడిపోవడానికి వాతావరణ పరిస్థితులు కాదని, మార్కెట్లో కొనుగోలు చేసిన విత్తనాల నాణ్యతా లోపమే ప్రధాన కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. నకిలీ విత్తనాలు అంటగట్టడం వల్లే పంట ఇలా చెట్టుమీదనే మొలకెత్తిందని వారు మండిపడుతున్నారు. దీంతో ఆగ్రహించిన బాధిత రైతులంతా మొలకెత్తిన సోయా మొక్కలను చేతబూని కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వ్యవసాయ శాఖాధికారులు వెంటనే స్పందించి, ఫీల్డ్ విజిట్ చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన క్షేత్రాలను పరిశీలించి, మోసపూరిత విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. నష్టపోయిన ప్రతీ రైతుకు న్యాయం చేసి తగిన నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

గ‌తంలోనూ ఇదే దుస్థితి…
సోయా విష‌యంలో గ‌తంలో సైతం రైతులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు ‘తేజస్వి’ రకం సోయా విత్తనాల 405 బ్యాగులను కొనుగోలు చేసి విత్తుకున్నారు. ప‌దిహేను రోజుల పాటు మొల‌క‌లు రాలేదు. దీంతో తాము మోస‌పోయామ‌ని గ్ర‌హించిన రైతులు అప్పుడు కూడా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంట‌నే దీనిపై కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. మొలకెత్తని సోయా విత్తనాల ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి పూర్తి నివేదిక సమర్పించాలని సూచించారు.

 

You might also like