ఓడిన ప్రతీసారీ రాజ్యాంగ సంస్థలపై నిందలా..?

కాంగ్రెస్‌పై మంచిర్యాల బీజేపీ నేత‌ల‌ ఫైర్

ఎన్నికల్లో ఓడిన ప్రతీసారీ కాంగ్రెస్‌కు రాజ్యాంగ సంస్థలపై నిందలు మోపడం అల‌వాటుగా మారింద‌ని బీజేపీ నేత‌లు దుయ్య‌బ‌ట్టారు. ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ది తప్పుడు ప్రచారమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ మీడియా ప్యానలిస్ట్ తుల ఆంజనేయులు మాట్లాడారు. గ‌తంలో కాంగ్రెస్ నేతలు ఈవీఎంలపై ఆరోపణలు చేశారని, ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో ఇదే ఎన్నికల సంఘంపై ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు మాత్రం ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

ఎన్నికల కమిషనర్ల మధ్య ఫైళ్లపై చర్చలు, అంతర్గత సూచనలు జరగడం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. సెప్టెంబర్ 26న జరిగిన సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కలిసి నిర్ణయాలు తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించిందని తెలిపారు. ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్య‌బ‌ట్టారు. SIR విష‌యంలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, నకిలీ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

నోటీసులు అందుకున్న ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇళ్ల వద్దకు వెళ్లి పత్రాలు సేకరించే వెసులుబాటు కల్పించారని బీజేపీ నేతలు తెలిపారు. విచారణ అవసరమైన సందర్భాల్లో ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యే అవకాశం, ఓటరు స్వయంగా రాలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ద్వారా హాజరు అయ్యే వెసులుబాటు కూడా కల్పించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘంపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే వాటిని ప్రజల ముందు ఉంచాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో కోర్టులో ప్రమాణపూర్వక అఫిడవిట్ దాఖలు చేయాలని వారు సవాల్ చేశారు. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ వంటి రాజ్యాంగ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. ఈ సమావేశంలో ముఖేష్ గౌడ్, వెంకటేశ్వరరావు, కృష్ణ, ప్రేమ్ సింగ్, రాజు, రాజేంద్రప్రసాద్, కమలాకర్ రావు, జయరాం రావు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

You might also like