బాసర ట్రిపుల్ ఐటీ.. నీటి కష్టాలు.. ఆన్‌లైన్ క్లాసులు..

ఎల్‌నినో ప్రభావం విద్యాసంస్థల పైనా పడుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలోని ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT)లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. క్యాంపస్‌లో విద్యార్థులకు సరిపడా నీరు లేకపోవడంతో.. దసరా సెలవులను పొడిగిస్తూ వర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు నష్టపోకుండా ఆన్‌లైన్ తరగతుల వైపు మొగ్గుచూపుతున్నారు.

తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT)లో సుమారు 9 వేల మంది విద్యార్థులు, వెయ్యి మంది సిబ్బంది ఉన్నారు. వీరందరి అవసరాలకు రోజుకు 20 లక్షల లీటర్ల నీరు అవసరం. కానీ, ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాలు లేకపోవడంతో గోదావరిలో నీటిమట్టాలు దారుణంగా పడిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనూ తగినంత నీరు లేకపోవడంతో గోదావరిలోని ఇన్‌టేక్ వెల్ నుంచి రోజుకు కేవలం 10 లక్షల లీటర్ల నీరు మాత్రమే అందుతున్నట్లు వర్సిటీ వీసీ ఏ. గోవర్ధన్ తెలిపారు. నీటి సమస్యను అధిగమించేందుకు క్యాంపస్‌లో 800 అడుగుల లోతులో సుమారు 30 బోరుబావులు తవ్వించినా ఫలితం లేకుండా పోయింది.

దీంతో ప్రత్యామ్నాయ నీటి వనరులు దొరికే వరకు క్యాంపస్‌ను తిరిగి తెరవకూడదని అధికారులు నిర్ణయించారు. దసరా సెలవుల అనంతరం శుక్రవారం రీ-ఓపెన్ కావాల్సిన కళాశాలకు.. సెలవులను పొడిగించారు. అయితే, విద్యార్థుల అకడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు వర్సిటీ అధికారులు సవరించిన అకాడమిక్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. అక్టోబర్ 26 నుంచి పీయూసీ-1 నుంచి ఈ-4 వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 17 నాటికి సిలబస్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పీయూసీ విద్యార్థులు నవంబర్ 10న, ఇంజనీరింగ్ విద్యార్థులు నవంబర్ 18న క్యాంపస్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

నవంబర్ 19 నుంచి 21 వరకు అన్ని బ్యాచ్‌లకు మిడ్‌టర్మ్ పరీక్షలు, నవంబర్ 23 నుంచి ఎండ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. పాత బ్యాచ్‌లకు చెందిన రిమిడియల్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా అధికారులు ప్రకటించారు. మారిన షెడ్యూల్, తరగతుల సమాచారం కోసం విద్యార్థులు ఆన్‌లైన్ క్లాస్‌రూమ్ పోర్టల్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని యాజమాన్యం సూచించింది.

You might also like