క్షమాపణలతో కొత్త రాజకీయం..
తెలంగాణ రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాలు ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతాయో చెప్పడానికి తాజా ఘటనే ఒక ఉదాహరణ. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇటీవలే బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్‌పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అసలు కొండా సురేఖ వ్యూహం ఏంటి…? ఆమె మళ్లీ గులాబీ గూటికి చేరుతున్నారా…?
కొండా సురేఖ.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఆమె.. తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై కేటీఆర్ పరువునష్టం దావా కూడా వేశారు. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేశానని, తన వ్యాఖ్యల వల్ల కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే చింతిస్తున్నానని పేర్కొంటూ సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
అయితే, ఈ క్షమాపణల వెనుక భారీ రాజకీయ వ్యూహం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్‌లో కొండా సురేఖను రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి తొలగించడం తెలిసిందే. కనీస సమాచారం ఇవ్వకుండా తనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంపై సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీసీ మహిళను కావడం వల్లే తనను తప్పించారా…? అంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని బహిరంగంగానే ప్రశ్నించారు. అప్పటినుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న కొండా దంపతులు.. ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
న్యాయపరమైన చిక్కులను తొలగించుకుని, బీఆర్ఎస్ అధిష్టానంతో సయోధ్య కుదుర్చుకోవడానికే కేటీఆర్‌కు సురేఖ క్షమాపణలు చెప్పారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొండా సురేఖకు గతంలో చాలా పార్టీలు మారారు. మొదట కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న సురేఖ.. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్‌ను వీడి జగన్ వెంట నడిచిన ఆమె.. 2014లో టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి, 2023లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు మంత్రి పదవి పోవడంతో.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బలమైన పట్టున్న కొండా దంపతులు మళ్లీ కారెక్కేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జోరందుకుంది.
సురేఖ క్షమాపణలతో బంతి ఇప్పుడు బీఆర్ఎస్ కోర్టులో ఉంది. కొండా దంపతుల రీ-ఎంట్రీకి కేటీఆర్, బీఆర్ఎస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో అవమానం ఎదుర్కొన్నామని భావిస్తున్న కొండా మురళి, సురేఖల తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? గులాబీ బాస్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.