మరో ఏడాది ధైర్యంగా ఉండండి
మరో ఏడాది మీరు ధైర్యంగా ఉండండి.. ఆ తర్వాత కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారు.. రైతులకు మళ్లీ భరోసా కల్పిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు కుటుంబాలు మనోధైర్యం కోల్పోవద్దని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతుల కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందక, యూరియా కొరత, విద్యుత్ సమస్యలు, పంటల కొనుగోళ్లలో ఇబ్బందులతో అప్పుల భారం పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక్క తలమడుగు మండలంలోనే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాల ద్వారా భరోసా కల్పించామని కేటీఆర్ పేర్కొన్నారు. రైతు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల రైతుబీమా సాయం 15 రోజుల్లోపు కుటుంబానికి అందేదని గుర్తుచేశారు. పంటల సాగు సమయంలో రైతుబంధు అందేదని, పంటలకు ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసేదని అన్నారు. ప్రస్తుతం యూరియా కొరత, విద్యుత్ సరఫరా సమస్యలు, పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు రైతులను వేధిస్తున్నాయని విమర్శించారు. కిసాన్ యాప్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.
రైతు కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అయినప్పటికీ.. బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా నిలవాలని కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే బాధిత నాలుగు కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందించినట్లు చెప్పారు. తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగించాలని స్థానిక నాయకులకు కేటీఆర్ సూచించారు. పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.