ఆ విజయాల వెనక అతడు
బీఆర్ఎస్ సభల విజయం వెనుక బాల్క సుమన్ శ్రమ!
ప్రధానమంత్రి మోదీ వచ్చినా ఆదిలాబాద్‌లో ఈ స్థాయిలో సభ జరగలేదు.. అంత అద్భుతంగా జరిగింది… ఓ నేత ప్రశంస… ఎందుకు జరగలేదో నాకు తెలుసు… ఎందుకంటే వాళ్ల వెంట బాల్క సుమన్ లేడు కాబట్టి… ఇదీ ఇంకో నాయకుడి కితాబు… ఇదేదో ముఖస్తుతికి అన్న మాటలేం కాదు… నిజంగానే బీఆర్ఎస్ సభ కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించారు.. ఆ సభ భారీగా విజయవంతం అయ్యింది… దీనికి కారణం అతడే…
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా, గులాబీ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా గర్జన సభలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపుతున్నాయి. గోదావరిఖనిలో నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’, తాజాగా ఆదిలాబాద్‌లో చేపట్టిన ‘రైతు గర్జన’ సభ.. ఊహించిన దానికంటే మించి విజయవంతం అయ్యాయి… దీంతో గులాబీ శిబిరంలో జోష్ ఒక్కసారిగా పెరిగింది. అయితే, ఈ రెండు భారీ సభల వెనుక యువనేత బాల్క సుమన్ పోషించిన పాత్ర, ఆయన పడ్డ శ్రమే ప్రధాన బలమని చెబుతున్నారు.
కేటీఆర్ ఆదేశాలు.. గ్రౌండ్‌లోకి బాల్క సుమన్..
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ఏ చిన్న ఆదేశం వచ్చినా, తక్షణమే రంగంలోకి దిగడం బాల్క సుమన్ ప్రత్యేకత. ఈ రెండు సభల విషయంలోనూ ఆయన అచ్చం అలాగే వ్యవహరించారు. సభ జరగనున్న ప్రాంతంలో నిద్రాహారాలు మాని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. సింగరేణి కార్మిక గర్జన సమయంలో ఆయనే ప్రత్యేకంగా సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తూ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఇక రైతు గర్జన సభకు కూడా రైతులు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చేలా ప్రత్యేక వ్యూహం అమలు చేశారు.
అద్భుతం… ఆ సమన్వయం..
ఇంట్లోనే నలుగురిని ఒక్క తాటికి తేవాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది… కానీ, పాత, కొత్త నేతలను సమన్వయం చేస్తూ బాల్క సుమన్ ముందుకు సాగారు. ఆయన ఆదిలాబాద్ నాయకులకు చెప్పిన ముచ్చట ఒక్కటే… నేను ఇక్కడ పోటీ చేసేదేం లేదు… ఈ సభ విజయవంతం అయితే, జనసమీకరణ జరిగితే అంతిమంగా మీకే లాభమంటూ వారికి ఉన్న విషయాన్ని బోధపరిచారు. అటు గోదావరిఖని, ఇటు ఆదిలాబాద్… రెండింటిలోనూ ఒకటే మంత్రాన్ని సంధించారు. అదే సమయంలో ఎవరికి ఏ పని అప్పజెప్పాలో చెప్పి… సభల విజయవంతానికి కృషి చేశారు.
కళకళలాడుతున్న గులాబీ శ్రేణులు
ఒకవైపు వరుస సభలు విజయవంతం అవుతుండటం, మరోవైపు యువనేతల క్రియాశీలక భాగస్వామ్యం పార్టీ క్యాడర్‌లో కొత్త జోష్ నింపుతోంది. కష్టకాలంలోనూ పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నేతలను శ్రేణులు అభినందిస్తుండటంతో, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టబోయే పోరాటాలకు ఈ విజయాలు మరింత ఊతమిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.