కరువు రాక్షసుణ్ణి మళ్ళీ తెచ్చారు

కాంగ్రెస్ కరువు రాక్షసుణ్ణి మళ్ళీ తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు.ఆదిలాబాద్‌లో జరిగిన రైతు గర్జన సభలో కేటీఆర్ అధికార కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో తెలంగాణను నాశనం చేశారని, కరవు రాక్షసుడిని మళ్లీ రాష్ట్రంలోకి తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ఢిల్లీకి కప్పం కట్టడానికే సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. మరోవైపు తెలంగాణ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు.

రైతు డిక్లరేషన్ పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తే జరిమానాలు వేస్తామంటున్నారని, యాసంగి పంట వేస్తే రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకునే దుస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పుడు అన్నీ బంద్ అయ్యాయని.. నీళ్లు, బీమా ఇవ్వడం లేదని, రైతుబంధు రాలేదని విమర్శించారు. గోదావరి నుంచి 750 టీఎంసీల నీళ్లు కిందికి వృథాగా పోతున్నా ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు.

రాష్ట్రంలో అన్నపూర్ణ లాంటి తెలంగాణలో కరవు రావడానికి కారణం ప్రకృతి కాదని, కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేటీఆర్ విమర్శించారు. ‘కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు.. కాంగ్రెస్ అంటే కరవు, కన్నీళ్లు, వలసలు’ అని అభివర్ణించారు. ఎల్ నినో అనేది ఉత్త ముచ్చట అని, తాము నిర్మించిన కాళేశ్వరం వాడుకుంటే కరవే ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధుతో పాటు ఇప్పటిది కలిపి మొత్తం నాలుగు దఫాల డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను, రైతులను మోసం చేసిన మోసగాడు సీఎం రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. తన పదవి రెన్యువల్ కోసం ఢిల్లీకి, రాహుల్ గాంధీకి ఈఎంఐల రూపంలో కప్పం కడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంకు నీళ్లు తీసుకుపోతున్నా పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం రేవంత్ నీళ్లు ఇవ్వడం లేదన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో ఎలుకలు కొరికి రోగులు చనిపోతుంటే కనీసం పట్టించుకునే సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో బొగ్గు కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు.

ఇదే సభలో బీజేపీపైనా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని, స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ దోపిడీకి వంతపాడుతున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట దోపిడీ జరుగుతున్నా బీజేపీ నేతలు నోరుమెదపడం లేదన్నారు. ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని కేంద్రం తుక్కు కింద అమ్ముతుంటే, దానికోసం బీఆర్ఎస్ నేత జోగురామన్న మాత్రమే ఒంటరిగా పోరాడుతున్నారన్నారు. ఏపీ ఎంపీల మద్దతుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం, అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను పునరుద్ధరిస్తూ తెలంగాణలోని సీసీఐని మాత్రం అమ్మేస్తోందని దుయ్యబట్టారు. మోదీ 13 ఏళ్ల పాలనలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ గానీ, ప్రత్యేక ప్యాకేజీ గానీ ఇవ్వలేదని, మన పరిశ్రమలను గుజరాత్‌కు తరలిస్తున్నారని విమర్శించారు.

బడే భాయ్ మోదీ, చోటా భాయ్ రేవంత్ ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో అన్నింటికీ హాలిడే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇక ప్రజలు హాలిడే ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ పిలుపునిచ్చారు.

You might also like