బతికించండి సార్.. పోలీసులను వేడుకున్న రాప్తాడు నిందితుడు..
బతికించండి సార్.. దండం పెడతా… రికవరీ చేయించండి సార్ అంటూ రాప్తాడు నిందితుడు హేమంత్ పోలీసులను వేడుకున్నాడు… శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కత్తితో దాడికి యత్నించడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. గాయపడిన హేమంత్‌ను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హేమంత్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో దండం పెడతా బతికించండి సార్.. అని పోలీసులను వేడుకున్నాడు. బాలికపై దాడి చేసిన వెంటనే పరారైన నిందితుడు హేమంత్.. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు ఆడవుల్లో ఉన్నాడని పోలీసులుకు సమాచారం అందింది. అతడ్ని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై హేమంత్ కత్తితో దాడికి దిగాడు. సీఐపై దాడికి కూడా దిగాడు. నిందితుడు దాడిలో సీఐ వెంకటేశుల చేతికి తీవ్ర గాయం కూడా అయింది. దీంతో పోలీసులు వెంటనే ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు.
తాజాగా.. నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. వైద్యులు అడిగిన ప్రశ్నలకు హేమంత్ సమాధానాలు చెబుతున్నాడని, తన పేరు అడిగితే హేమంత్ అని చెబుతున్నట్లు వెల్లడించారు. కుడికాలుకు తీవ్ర గాయమయ్యింది. ఆ కాలుకు రక్త ప్రసరణ తగ్గిందని, ఇదే పరిస్థితి కొనసాగితే కుడికాలు తొలగించాల్సిన అవసరం రావచ్చన్నారు. హేమంత్ రెండు కాళ్లలో బుల్లెట్లు ఉన్నాయనే అనుమానంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే ఎక్స్‌రే పరీక్షల్లో కాళ్లలో బుల్లెట్లు కనిపించలేదని సర్జరీ వైద్యులు వెల్లడించినట్లు సూపరింటెండెంట్ తెలిపారు.