ప్ర‌తీ రోజూ ల‌క్ష కోట్లు… యూపీఐ లావాదేవీల్లో రికార్డు

UPI New Record: దేశంలో యూపీఐ (UPI Transactions) ద్వారా జరిగే చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పండగల కొనుగోళ్లు,ఆన్‌లైన్ ఆఫర్లు ఈ వృద్ధికి మరింత ఊతమిచ్చాయి. ఈ ఏడాది అక్టోబరులో మొత్తం 2,547 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదు కాగా, వీటి విలువ రూ.31.53 లక్షల కోట్లు. అంటే రోజుకు సగటున రూ.లక్ష కోట్లకు పైగా విలువైన చెల్లింపులు జరిగాయన్న మాట‌.. యూపీఐ లావాదేవీల రోజువారీ సగటు విలువ రూ.లక్ష కోట్లను దాటడం ఇదే తొలిసారి అని గ‌ణాంకాలు చెబుతున్నాయి. రోజుకు సగటున 82.2 కోట్ల లావాదేవీలు జరగడం కూడా మరో రికార్డు. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈసారి యూపీఐ లావాదేవీల సంఖ్య 23 శాతం పెరిగింది.

దేశంలో నోట్ల రద్దు తర్వాత పుట్టుకొచ్చిన యూపీఐ లావాదేవీలు సగటు భారతీయుల్ని విపరీతంగా ఆకర్షించాయి. ఇప్పుడు ఆ ఆకర్షణ విలువ రోజుకు లక్ష కోట్లు దాటిపోయింది. గత నెలలో దేశవ్యాప్తంగా రికార్డు స్ధాయిలో ఏకంగా 31.53 లక్షల కోట్ల యూపీఐ చెల్లింపులు జరిగాయి. దీంతో భారతీయ యూపీఐ చరిత్రలో తొలిసారి నెలకు 30 లక్షల మార్క్ దాటిపోయాయి. భవిష్యత్తులో ఇవి మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

దేశంలో యూపీఐ లావాదేవీల సంఖ్య ప్రతీ నెలా పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 29.9 లక్షల కోట్ల మార్క్ నమోదు చేసి రికార్డు సృష్టించిన యూపీఐ చెల్లింపులు.. అక్టోబర్ నాటికి 31.53 లక్షల కోట్లకు చేరుకుని ఆ రికార్డును తిరగరాశాయి. అలాగే సెప్టెంబర్ లో రోజుకు 98 వేల కోట్ల లావాదేవీలు నమోదు కాగా.. ఇది కాస్తా అక్టోబర్ కు వచ్చే సరికి రోజుకు లక్ష కోట్లు దాటిపోయింది. అక్టోబర్ నెలలో చరిత్రలోనే తొలిసారి నెలకు 30 లక్షల కోట్ల లావాదేవీల మార్క్, రోజుకు లక్ష కోట్లకు పైగా లావాదేవీల మార్క్ దాటిపోయాయి. దీంతో యూపీఐ వ్యవస్థపై భారం అంతకంతకూ పెరిగిపోతోంది.

ఈ ఏడాది పండుగ సీజన్ కారణంగా యూపీఐ లావాదేవీల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే 31 రోజులున్న నెలలో యూపీఐ లావాదేవీలు అదనంగా నమోదు కావడం కూడా ఈ రికార్డుకు కలిసి వస్తోంది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు సిద్దమైన కేంద్రం గత నెలలో దాన్ని పండుగల సీజన్ పేరుతో వాయిదా వేసింది. దీపావళి తర్వాత ఈ ఛార్జీలను విధించే అవకాశం ఉంది. వ్యాపారులకు చేసే 2 వేలకు మించిన చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ విధించేందుకు కేంద్రం రంగం సిద్దం చేస్తోంది. దీనిపై వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం వెనక్కుతగ్గేలా కనిపించడం లేదు. యూపీఐ వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఈ ఛార్జీలు తప్పనిసరి అని చెబుతోంది.

 

You might also like