ఏరియా ఆసుపత్రిలో నూతన డయాలసిస్ యంత్రాలు ప్రారంభం
సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రామగుండం ఏరియా ఆసుపత్రిలో ఆరు అత్యాధునిక డయాలసిస్ యంత్రాలు ప్రారంభించారు. సుమారు రూ. 60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 6 అత్యాధునిక డయాలసిస్ యంత్రాలను సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీఎం డి. లలిత్ కుమార్ , వైద్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నూతన యంత్రాల ఏర్పాటుతో కిడ్నీ వ్యాధిగ్రస్తులైన కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు నిరంతరాయంగా నాణ్యమైన డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.