ఓపెన్‌కాస్టుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
మురసు తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. పలు ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో వేలాది టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మంగళవారం రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సత్తుపల్లిలో 5.3 సెంటీమీటర్లు, అశ్వారావుపేటలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఈ వర్షాలతో ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. గనుల్లోకి వర్షపు నీరు భారీగా చేరడం, రవాణా మార్గాలు పూర్తిగా బురదమయంగా మారడంతో.. ఎక్స్‌కవేటర్లు, డంపర్లు వంటి భారీ యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో అటు మట్టి (ఓవర్‌బర్డెన్ – ఓబీ) వెలికితీతతో పాటు, ఇటు బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలిగింది. సత్తుపల్లిలోని జేవీఆర్ (JVR), కిష్టారం ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తితో పాటు, ఓవర్‌బర్డెన్ తొలగింపు పనులు నిలిచిపోయాయి. మణుగూరు ప్రాంతంలోనూ దాదాపు బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు పనులకు బ్రేక్ పడింది.
భారీ యంత్రాలు, బొగ్గు రవాణా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోవడంతో రోజువారీగా వేలాది టన్నుల ఉత్పత్తి నష్టం వాటిల్లుతోందని సింగరేణి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భారీ మోటర్ల సహాయంతో గనుల్లోకి చేరిన నీటిని బయటకు పంపుతున్నారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత, దశలవారీగా పనులను పునఃప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.