నిన్న మరణం… నేడు విజయం
ప్రజలకు సేవ చేయాలని ఎన్నో కలలు కన్నది. జనం మధ్య తిరుగుతూ తనను గెలిపించాలని అభ్యర్థించింది. ఓటర్ల ఆశీర్వాదంతో విజయం సాధించింది. కానీ, తాను గెలిచానన్న వార్త వినేలోపే విధి వక్రించి అనంతలోకాలకు వెళ్లిపోయింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఓ విషాద ఘటన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. విజయం వరించినా.. ఆ ఆనందాన్ని చూసేందుకు ఆ మహిళా అభ్యర్థి ప్రాణాలతో లేదు. ముక్కుపచ్చలారని పసికందులు తల్లిలేని వారవ్వడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం గ్రామానికి చెందిన గారపాటి దివ్య వయసు 28 ఏళ్లు. డిగ్రీ చదివిన ఆమె శ్రీనివాస్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడితో పాటు.. కేవలం మూడు నెలల వయసున్న మరో పసికందు ఉన్నాడు. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన అవకాశంతో.. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఆమె బరిలోకి దిగారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటానని మాటిస్తూ ఎంతో చురుగ్గా ప్రచారం చేశారు.
ఈ క్రమంలో నవంబర్ 5 గురువారం జరిగిన పోలింగ్ లో ఓటు వేసిన కొద్దిగంటలకే ఆమెకు తీవ్రమైన గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే దేవరపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి, ఆ తర్వాత రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కాస్త కోలుకోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. కానీ శుక్రవారం ఉదయం మరోసారి తీవ్రమైన నొప్పి రావడంతో తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమెకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
తీరా శనివారం వెలువడిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో.. జనసేన అభ్యర్థి దివ్య తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థిపై ఏకంగా 352 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కానీ, ఆ గెలుపు సంబరాలను చూసేందుకు ఆమె ప్రాణాలతో లేరు. ఒకవైపు ఎంపీటీసీగా దివ్య గెలిచారన్న వార్త, మరోవైపు ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతుండటం అందరినీ కలచివేసింది. ముఖ్యంగా తల్లి ప్రేమకు దూరమైన ఆ ఇద్దరు పసిపిల్లలను చూసి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
విధి రాత ఎంత బలీయమైనదో ఈ ఘటనే చెబుతోంది. ప్రజల ఆశీర్వాదం ఆమెకు విజయాన్ని అందించినా.. ఆ ఆనందాన్ని పంచుకునే అదృష్టం ఆ తల్లికి లేకుండా పోయింది. ప్రజా సేవ చేయాలన్న ఆమె కలలు మధ్యలోనే మిగిలిపోయాయి. ఏ పాపం ఎరుగని పసిపిల్లలు.. ఇప్పుడు అనాథలుగా మారడం నిజంగా ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఆ కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనమూ కోరుకుందాం.