క‌లెక్ట‌ర్‌కు ఆరు నెల‌ల జైలు శిక్ష‌..

న్యాయస్థానం ఉత్తర్వులను బేఖాతరు చేసిన ఓ క‌లెక్ట‌ర్‌కు ఏకంగా ఆరు నెల‌ల జైలు శిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా నిర్దారించిన హైకోర్టు ఈ తీర్పు వెలువ‌రించింది. జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కలెక్టర్ కు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష.. రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని ప్లాట్లను తొలగించాలన్న వినతి పరిశీలించాలని గతంలో కోర్టు క‌లెక్ట‌ర్‌ను ఆదేశించింది. 2025 ఆగస్టులో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది… ఈ ఉత్త‌ర్వుల ప్రకారం 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోర్టు నిర్దేశించిన 60 రోజుల గడువు ముగిసినా కలెక్టర్ నారాయణ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాధితులు తిరిగి 2025 అక్టోబర్ 15న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ దాఖ‌లైన త‌ర్వాత అధికార‌ యంత్రాంగం కదిలింది. అధికారులు బాధితులకు నోటీసులు జారీ చేసి, 2026 ఫిబ్రవరి 26న వారి వినతి తిరస్కరించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన తర్వాతే ఇలా ప్రక్రియను చుట్టేయడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశించిన సమయంలో స్పందించకుండా, పిటిషన్ దాఖలయ్యాక నామమాత్రంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారించింది. ఐఏఎస్ స్థాయి అధికారి కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని స్పష్టం చేస్తూ ధర్మాసనం కఠిన నిర్ణయం తీసుకుంది.

ఈ మేర‌కు కలెక్టర్ నారాయ‌ణ రెడ్డికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష.. రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును 4 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

You might also like