లోన్​ యాప్​ వేధింపులు… కానిస్టేబుల్ ఆత్మహత్య..

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడకు చెందిన ముడవత్ శ్రీను (31), కొండాపూర్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఏడాది కింద‌ట‌ వివాహం జరిగింది. అత‌ను నాలుగు నెలల కింద‌ట లోన్ యాప్ నుంచి రూ. 40,000 అప్పు తీసుకున్నాడు. దానిని తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు అతడిని వేధించడం ప్రారంభించారు. దీపావళి వేళ డ్యూటీకి సెలవులు పెట్టి ఆదివారం రోజు అతను ఇంట్లోనే ఉండగా, లోన్​ యాప్​ నిర్వాహకులు ప్రతి గంటకు ఫోన్ చేసి వేధించారు. తీసుకున్న రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించకపోతే శ్రీను, అతడి భార్య నగ్న చిత్రాలను వారి కుటుంబ సభ్యులతో పాటు హర్షగూడ గ్రామస్థులకు పంపుతామని బెదిరించారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను, సోమవారం ఉదయం తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందిన వెంటనే పహాడీషరీఫ్ పోలీసులు అక్కడకు చేరుకుని శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

You might also like