ఆ పుస్త‌కంలో త‌ప్పులెన్నో..

కాంగ్రెస్ నాయకురాలు సోనియా ఇటీవల విడుదల చేసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ అనే ఆత్మకథ ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. అయితే, ఈ పుస్త‌కంలో పెద్ద ఎత్తున త‌ప్పులు దొర్లాయి… ఆమె జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ రాసిన ఈ పుస్తకం వక్రీకరణలు, అబద్ధాలు, వాస్తవ దోషాలతో ఉంద‌ని ప‌లువురు ప‌రిశీల‌కులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆరుసార్లు పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన ఆమె రాజ‌కీయాల గురించి, చివ‌ర‌కు త‌న భ‌ర్త‌, కొడుకు గురించి చెప్పిన ప‌లు అంశాల్లో సైతం త‌ప్పులున్నాయని… ఈ పుస్తకంలో 55 తప్పులు ఉన్నాయని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి..

“దేశాన్ని దశాబ్దాల పాటు శాసించిన కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం అధ్యక్షురాలిగా పనిచేసిన సీనియర్ నేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పుస్తకం పేరు ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’. కానీ, ఇందులో ఉన్నది వాస్తవాలపై ప్రేమ కాదు.. అబద్ధాల ఊబి! ఒక సాధారణ గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసే నిజాలను కూడా పక్కనపెట్టి, ఏకంగా 55 చారిత్రక తప్పులతో ఒక పుస్తకాన్ని ఎలా వదిలారో చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన నాయకురాలికి కనీస పార్లమెంటరీ వ్యవస్థపై కూడా అవగాహన లేదా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవాస్తవాలు, వక్రీకరణలతో నిండిన ఈ ఆత్మకథలో సోనియా చేసిన ఘోరమైన తప్పులేంటో.. నాంది న్యూస్‌ ప్రత్యేక కథనం…”

రెండు దశాబ్దాలకు పైగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న సోనియా గాంధీకి భారత పార్లమెంటరీ వ్యవస్థ గురించి కనీస అవగాహన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. లోక్‌సభ సభ్యులు ఎన్నికవుతారని, రాజ్యసభ సభ్యులు నామినేట్ చేయబడతారని ఆమె తన పుస్తకంలో రాసుకొచ్చారు. వాస్తవానికి రాజ్యసభ సభ్యులు పరోక్షంగా ఎన్నికవుతారన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఆ పుస్తకంలో కొరవడింది.

ఇక తన రాజకీయ ప్రత్యర్థి అయిన ‘ఆర్ఎస్ఎస్’ స్థాపన గురించి ప్రస్తావిస్తూ.. అది 1921లో స్థాపించబడిందని తప్పులో కాలేశారు. అది 1925లో కె.బి.హెడ్గేవార్ స్థాపించార‌నే విషయం బహుశా ఆ సీనియర్ నేతకు తెలియదేమో! పోనీ ప్రత్యర్థుల గురించి తెలియదు అనుకుంటే.. గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన అహ్మద్ పటేల్ మరణాన్ని సైతం 2022లో జరిగినట్లు రాశారు. ఆయన కోవిడ్ బారిన పడి 2020లో మరణించిన సంగతి కూడా ఆమెకు గుర్తులేకపోవడం విచారకరం.

చారిత్రక వాస్తవాలను వక్రీకరించడంలో ఈ పుస్తకం హద్దులు దాటేసింది. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ప్రస్తావనలో, 1970 నుంచే ‘గాంధీనగర్’ రాజధానిగా ఉన్నప్పటికీ.. అహ్మదాబాద్‌ను రాజధానిగా పేర్కొన్నారు. అత్యంత దారుణమైన సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనకాండను ‘వివాదాస్పదమైనది’గా తేలిగ్గా కొట్టిపారేయడమే కాకుండా.. సుమారు 2000 మంది ఇస్లామిస్టుల గుంపు 59 మంది హిందూ కరసేవకులను సజీవ దహనం చేసిన ‘S-6’ బోగీ ఘటనను.. కేవలం నాలుగు బోగీలకు ముస్లింలు నిప్పు పెట్టినట్లుగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు.

ఎన్నికల లెక్కల విషయంలోనూ సోనియా మార్క్ గందరగోళం స్పష్టంగా కనిపించింది. 2014లో ఎన్డీఏ సీట్లను 336కి బదులు 353 అని.. 1984 కాంగ్రెస్ సీట్లను ఒకచోట 404, మరోచోట 405 అని తప్పుల తడకగా ముద్రించారు. కార్గిల్ యుద్ధం లాంటి సున్నితమైన దేశభద్రత విషయాల్లోనూ అదే నిర్లక్ష్యం. కార్గిల్ చొరబాటుదారులను లడఖీ కాపరి మే 3న గుర్తిస్తే, దాన్ని ఫిబ్రవరిలో జరిగిన వాజ్‌పేయి శాంతి యాత్రకు ముడిపెడుతూ కాలక్రమాన్ని ఇష్టమొచ్చినట్లు మార్చేశారు. 84 రోజుల పాటు జరిగిన కార్గిల్ యుద్ధాన్ని ఏకంగా 10 నెలలు జరిగినట్లు రాసి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు.

సొంత కొడుకు రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులోనూ కనీస వివరాలు ఇవ్వలేకపోయారు. 2019లో నమోదైన కేసును 2023లో నమోదైందని.. 5 నెలల్లో కోర్టు సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తే, దానికి ఏడాది పట్టిందని తప్పుగా పేర్కొన్నారు. ఇక 1986 నాటి ముస్లిం మహిళల చట్టం పై సుప్రీంకోర్టు తీర్పును సైతం తమకు అనుకూలంగా వక్రీకరించి రాసుకున్నారు. నెల్సన్ మండేలా పర్యటన, అప్పటి ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ పేరును ఏకంగా ‘ఆర్.కె. నారాయణ్’ అని రాయడం, చైనా అధ్యక్షుడు డెంగ్ జియావోపింగ్ అంటూ అంతర్జాతీయ స్థాయిలోనూ పొరపాట్లు చేశారు. కనీసం తన ప్రేమకథ గురించి రాసుకున్న అధ్యాయంలో.. రాజీవ్ గాంధీతో తన వయస్సుల లెక్కలను కూడా సరిగ్గా వేసుకోలేకపోయారు.

“చూశారుగా.. ఇదీ సోనియా గాంధీ ‘జ్ఞాపకాల’ అసలు స్వరూపం! దేశ రాజకీయాలను శాసించిన ఒక జాతీయ స్థాయి నాయకురాలికి, ప్రధాన చారిత్రక సంఘటనలపై ఇంత పేలవమైన అవగాహన ఉండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పోనీ ఆమె వయసు పైబడి మర్చిపోయి రాశారు అనుకున్నా.. ప్రచురణకర్తలు కనీస వాస్తవాలను ‘ఫ్యాక్ట్-చెక్’ ఎందుకు చేసుకోలేదు…? దేశ రక్షణకు సంబంధించిన కార్గిల్ యుద్ధం మొదలుకొని.. సొంత కొడుకు పరువు నష్టం కేసు వరకు, అన్నీ అబద్ధాలు, వక్రీకరణలే! ఇది కేవలం ఆమె జ్ఞాపకశక్తి లోపమా..? లేక చరిత్రను తమకు అనుకూలంగా వక్రీకరించే ఉద్దేశపూర్వక కుట్రనా..? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

You might also like