నకిలీ నోట్లు.. నకిలీ నాణేలు… ఘరానా. మోసగాళ్లు అరెస్ట్

డబ్బులు రెట్టింపు చేస్తామంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఓ ఘరానా ముఠా గుట్టును ఆదిలాబాద్ పోలీసులు రట్టు చేశారు. మంత్రతంత్రాల పేరుతో మాయమాటలు చెప్పి.. అసలు కరెన్సీకి బదులు ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ నోట్లను అంటగడుతున్న కిలాడీలను కటకటాల వెనక్కి నెట్టారు. ఏకంగా 40 లక్షల రూపాయల విలువ గల నకిలీ నోట్లు, 100 నకిలీ బంగారు నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు…

మంచిర్యాల జిల్లాకు చెందిన పత్తి రాములు అనే వ్యక్తికి అత్రం పరశురామ్ అనే మాయగాడు పరిచయమయ్యాడు. మంత్రతంత్రాలు, పూజల ద్వారా డబ్బును రెట్టింపు చేస్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాధితుడు విడతల వారీగా 8 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. పూజల తర్వాత ఓ బ్యాగును ఇచ్చి పది రోజుల తర్వాత తెరవాలని పరశురామ్ చెప్పాడు. తీరా పది రోజుల తర్వాత బ్యాగు తెరిచి చూసిన బాధితుడు ఖంగుతిన్నాడు. అందులో కరెన్సీ కట్టలకు పైన, కింద మాత్రమే అసలు నోట్లు ఉండి.. మధ్యలో ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ నోట్లు, తెల్ల కాగితాలు ఉండటంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అత్రం పరశురామ్, మండలి బక్కన్న అనే ప్రధాన నిందితులు.. మరో నలుగురితో కలిసి ఈ దందా చేస్తున్నట్లు తేలింది. ఈ ముఠాకు చెందిన ఎంబడి మల్లేష్, చీటి తరుణ్, సాయి కృష్ణ, పేంద్రం సురేష్‌లను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి వివిధ డినామినేషన్లలో ఉన్న 99 కట్టల నకిలీ నోట్లు, 100 నకిలీ బంగారు నాణేలు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు ఇద్దరు ఇప్పటికే మరో కేసులో అరెస్టయి ఉన్నారు.

ఈ ముఠాపై ఆదిలాబాద్, హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో పలు కేసులు ఉన్నాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. దాదాపు 40 మందికి పైగా వీరు మోసం చేసి ఉంటారని, బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. మంత్రతంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తామనే మోసగాళ్లను నమ్మవద్దని.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో నష్టపోవద్దని ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా కరెన్సీ కట్టలు తీసుకునేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలని ఎస్పీ సూచించారు.

You might also like