కమలం.. కొట్లాటల గుమ్మం..
-మంచిర్యాలలో గ్రూపు తగాదాలు
-ఉన్న ముగ్గురు నేతలు ఎడమోహం.. పెడమోహం
-అధ్యక్షుడు ఏకపక్షంగా చేస్తున్నాడని పెదవి విరుపు
-కనీసం కార్యాలయం నిర్మించలేని దుస్థితి
-మిగతా రెండు నియోజకవర్గాల్లోనూ కానరాని నేతలు
-కొత్త చేరేవారు దేముడెరుగు.. పాత వారే జారుకుంటున్నారు
మంచిర్యాల : భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ స్థానికంగా మాత్రం నేతలు తలో దారితో కార్యకర్తలను అయోమయంలో పడేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో అదే పరిస్థితి కొనసాగుతోంది. బీజేపీ పార్టీలో ఉన్న ముగ్గురు నేతలు తలో దారి నడుస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని దుస్థితి. జిల్లాలో అసలు పార్టీ ఉందా..? లేదా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క మంచిర్యాల మినహా ఎక్కడా పార్టీకి కనీసం అభ్యర్థి కూడా సరిగ్గా లేరంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కొత్తగా వచ్చే వారిని పక్కన పెడితే పాత వారే జారుకుంటున్నారు.
అధ్యక్షుడి ఏకపక్ష ధోరణే కారణమా..?
మంచిర్యాల జిల్లాలో బీజేపీ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఆ పార్టీలో ఉన్న నేతలు కార్యకర్తలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా వెరబెల్లి రఘునాథ్‌రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీకి ఊపు వస్తుందని అంతా భావించారు. కానీ పరిస్థితి తారుమారైంది. యువనేత పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీలోకి యువతరం వస్తుందని జిల్లాలో పార్టీ పరిస్థితి మారుతుందని అనుకున్న వారి ఆశలు అడియాశలు అయ్యాయి. రఘునాథ్‌రావు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు సమస్యల మీద పోరాటం చేసినట్లు కనిపించినా మొక్కుబడిగా చేస్తున్నారని సొంత పార్టీ నుంచే నిరసన గళం వినిపిస్తోంది.
సీనియర్ల ఆచూకీ లేదు..
పార్టీలో సీనియర్ నేతలు ఆచూకీ మచ్చుకైనా కనిపించడం లేదు. అటు పార్టీ సమావేశాల్లో కానీ, ఇటు నిరసన కార్యక్రమాల్లో కానీ వారు కనిపించడం లేదు. ముల్కల్ల మల్లారెడ్డి, గోనెశ్యాంసుందర్‌రావు ఇద్దరూ పార్టీకి గతంలో ప్రాతినిథ్యం వహించారు. ఇప్పుడు వారు ఎక్కడా కనిపించడం లేదు. అధ్యక్షుడితో వీరికి పొసగడం లేదని అందుకే బయటకు రావడం లేదని చెబుతున్నారు. వారిని కలుపుకుపోయేందుకు అధ్యక్షుడు రఘునాథ్ సైతం ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని… ఆ పని చేయడం లేదని దుయ్యబడుతున్నారు. ఇక సీనియర్లు సైతం తమ వంతుగా పార్టీ పటిష్టత కోసం పని చేయడం లేదు. దీంతో ఉన్న ముగ్గురు నేతలు తలొదిక్కు అన్న చందంగా మారింది.
మిగతా చోట్ల మరింత దారుణంగా..?
జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రావు కేవలం తన నియోజకవర్గాన్ని వదలిపెట్టి రావడం లేదు. దీంతో మిగతా రెండు నియోజకవర్గాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జిల్లా అధ్యక్షుడు ఎక్కడికి రాకపోవడంతో బీజేపీ శ్రేణులు నిస్తేజంగా మారాయి. చెన్నూరు నియోజకవర్గ నేతగా అందుగుల శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఆయన కూడా పార్టీని పటిష్టం చేసేందుకు ముందుకు రావడం లేదు. గతంలో ఈయనకు ఇక్కడ టిక్కెట్టు ఇచ్చారు. డిపాజిట్ కూడా రాలేదు. మరి ఇప్పుడైనా పార్టీలో కార్యకర్తలను సిద్ధం చేసి ముందుకు వెళ్తారా..? అంటే అదీ లేదు.. వచ్చే ఎన్నికల వరకు శ్రేణులను సమాయత్తం చేసే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల్లాగే డిపాజిట్ దక్కేలా లేదు. ఇక బెల్లంపల్లి నియోజకవర్గం పరిస్థితి కూడా సేమ్ టూ సేమ్.
ఉన్న వారే జారుకుంటున్నారు..?
పార్టీలో కొత్తవారు చేరే మాట పక్కన పెడితే ఉన్న వారే జారుకుంటున్నరు. తాజాగా మందమర్రి పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్ బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు పలువురు నేతలు సైతం రాజీనామా బాట పట్టారు. ఇంత పెద్ద ఎత్తున రాజీనామా వ్యవహారం సాగుతున్నా జిల్లా అధ్యక్షుడు కనీసం పట్టించుకోలేదని సమాచారం. జిల్లాలో మరికొందరు సైతం పార్టీ వీడేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల వరకు పార్టీ పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధ్యక్షుడు రఘునందన్ రావు పార్టీ గురించి పట్టించుకుని ముందుకు సాగాలని పలువురు కోరుతున్నారు.