అల్లు అర్జున్ కాలు విరిగిందా..? చెయ్యి విరిగిందా..?

TG Assembly: సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన ఆయ‌న ఓ సినీనటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని సీఎం స్ప‌ష్టం చేశారు. సంధ్య థియేటర్‌కు హీరో వ‌స్తున్నాడ‌ని థియేట‌ర్ యాజ‌మాన్యం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే పోలీసులు దానికి అనుమ‌తి ఇవ్వ‌లేద‌న్నారు. థియేట‌ర్‌కు ఒక్కటే దారి ఉంది కాబట్టి హీరో హీరోయిన్ రావద్దని పోలీసులు చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు. హీరో కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే సరిపోయేది కానీ రోడ్ షో చేసుకుంటూ వచ్చాడని దానికి కారణంగా వేలాదిమంది వచ్చారని అన్నారు. ఆ కారణంగానే తొక్కిస‌లాట జ‌రిగింద‌న్నారు. మ‌రోవైపు హీరో వెంట వ‌చ్చిన బౌన్స‌ర్లు ప్ర‌జ‌ల‌ను నెట్టివేయ‌డంతో ఆ తొక్కిస‌లాట మ‌రింత ఎక్కువైంద‌ని స్ప‌ష్టం చేశారు. తొక్కిసలాటలో కన్నబిడ్డను పట్టుకునే ప్రయత్నంలో రేవతి చనిపోయిందన్నారు. ఆమె కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడన్నారు.

చ‌నిపోయిన స‌మ‌యంలో కూడా రేవ‌తి త‌న కొడుకు చేయి ప‌ట్టుకునే ఉంద‌న్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో హీరో సినిమాహాల్లోనే ఉన్నాడని ముఖ్య‌మంత్రి తెలిపారు. ఈ విష‌యంలో హీరోను వెళ్లిపోవాల‌ని చెప్పినా వినిపించుకోలేద‌న్నారు. ఏసీపీకి కోపం వచ్చి థియేట‌ర్ యాజ‌మాన్యాన్ని హెచ్చ‌రిస్తే పోలీసులు వెళ్లి సినిమా హీరోని థియేటర్ నుంచి పంపించి వేశారన్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హీరో రోడ్ షో చేశారన్నారు. ఓ వైపు చ‌నిపోయార‌ని చెప్పినా అలాంటి వ్య‌వ‌హారం ఏమిట‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు.

హీరోని స్టేషన్ కి తీసుకువెళ్లాక కొన్ని రాజకీయ పార్టీల నేతలు త‌న‌పై ఎంతో నీచంగా పోస్టులు పెట్టారని అన్నారు. రేవతి చనిపోతే 11 రోజుల వరకు ఎవరూ పరామర్శకు వెళ్లలేదు. ఆమె కొడుకు బ్రెయిన్ డెడ్ అయితే ప‌ట్టించుకోలేదు.. ఇదా మానవత్వం అంటూ ప్రశ్నించారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన నాపైన అడ్డగోలుగా ట్వీట్ చేశాడంటూ ఫైర్ అయ్యారు. పుష్ప 2 సినిమాకు స్పెషల్ షో అనుమతి ఇచ్చింది తానేనని సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే అనుమతి ఇచ్చామన్నారు. హీరో బయటకు వచ్చాక సినిమా వాళ్ళందరూ అతని ఇంటికి క్యూ కట్టారు కానీ తల్లి చనిపోయి ఆసుపత్రిలో కోమాలో ఉన్న వారిని సినీ ప్రముఖులు పరామర్శించారా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అల్లు అర్జున్ కాలు పోయిందా… కన్ను పోయిందా… దేనికి పరామర్శలు..? అంటూ ముఖ్య‌మంత్రి దుయ్య‌బ‌ట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like