బీసీ హాస్టల్ విద్యార్థిని మృతి

-నెల రోజుల వ్యవధిలో రెండో ఘటన
-హాస్టల్ లో తిండి బాలేక కేవలం పండ్లు తిన్న విద్యార్థిని
-అనారోగ్యంతో చనిపోయిందని అధికారుల ప్రకటన
-సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ

ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినులు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉంటూ స్థానిక ప్రైవేట్ డీఈడీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువు తున్న తొర్రం వెంకటలక్ష్మి (19) అనారోగ్యంతో మృతి చెందింది.

బెజ్జూర్ మండలం అందుగులపల్లికి చెందిన వెంకటలక్ష్మి అసిఫాబాద్ శ్రీనిధి కళాశాలలో డీఈడీ చదువుతోంది. స్థానిక బీసీ పోస్ట్ మెట్రిక్ వసతిగృహంలో అడ్మిషన్ తీసుకుంది. డీఈడీ ప్రథమ సంవ త్సరం వార్షిక పరీక్షలు ఉండటంతో వారం క్రితమే హాస్టల్కు వచ్చింది. అక్కడి భోజనం నచ్చకపోవడంతో ఎక్కువగా బయటి నుంచి పండ్లు తెచ్చుకుంటుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తలనొప్పిగా ఉందని ఒక్కసారిగా కింద పడిపోయింది. సిబ్బంది 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. అయితే వెంకటలక్ష్మి అనారోగ్యంతో ఉన్న విషయం తమకు తెలియజేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నా కూతురు వారం క్రితమే ఇక్కడికి వచ్చింది. సిబ్బంది మాకు ఏం చెప్పలేదు. తెలిస్తే మా బిడ్డను కాపాడుకునేవాళ్లం’ అని విద్యార్థిని తల్లి రోదించిన తీరు అక్కడి వారిని కన్నీళ్లు పెట్టిం చింది.

విద్యార్థిని మృతి చెందిన సమయంలో హాస్టల్ వార్డెన్ కూడా అందుబాటులో లేరు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా.. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లినా విద్యార్దిని ప్రాణాలు దక్కేవని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. విద్యార్థిని వెంకటలక్ష్మి అనారోగ్యం బాధపడుతూ మృతి చెందిందని జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి సీజవన్ ఒక ప్రకటనలో తెలిపారు..

నవంబర్ 25న వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల వసతిగృహంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని చౌదరి శైలజ(14) అస్వస్థతకు గురై నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా వెంకటలక్ష్మి మృత్యువాత పడటంతో విద్యార్థి సంఘాల నేతలు మండి పడుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like