ప్రాజెక్టుపై ప్లాస్టిక్ కవర్ కప్పి కాపాడుతున్నరు..
-కొమురం భీమ్ ప్రాజెక్టుకు ప్లాస్టిక్ కవర్లు కప్పిన అధికారులు
-ఆనకట్టను పట్టిష్టం చేసేందుకు నిధులు లేక తిప్పలు
-బిల్లులు కట్టకపోవడంతో ఆ ప్రాజెక్టు విద్యుత్ కనెక్షన్ కట్
-జనరేటర్ ద్వారా గేట్లు ఎత్తి, మూసివేస్తున్న సిబ్బంది
-అది కూడా పాడైతే ప్రాజెక్టు కొట్టుకుపోవడం ఖాయం
-అస్తవ్యస్తంగా మారిన ప్రాజెక్టు నిర్వహణ
ప్రపంచ చరిత్రలోనే ఇదో అద్భుతం.. ప్రాజెక్టును కాపాడుకునేందుకు అధికారులు ప్లాస్టిక్ కవర్లు తెచ్చి తిప్పలు పడుతున్నారు. ఇల్లు ఉరిస్తే ఆ జల్లుల నుంచి కాపాడుకునేందుకు కప్పుకుంటాం కదా అలా అన్న మాట.. అదేంటి ఆ కవర్తో అంత పెద్ద ప్రాజెక్టు ప్రమాదం నుంచి బయటపడుతుందా..? అంటే దాని నిర్వహణకు నిధులు లేవు మరి.. పాపం అధికారులు మాత్రం ఏం చేస్తారు… ఇదీ తెలంగాణలో ప్రమాదం అంచున ఉన్న ఓ ప్రాజెక్టు దుస్థితి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది రోజుల కిందటే కడెం ప్రాజెక్టు ప్రమాదం అంచున నుంచి బయటపడింది. దేవుడి దయ వల్ల ఆ ప్రాజెక్టుకు గండి పడటంతో ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి తప్పింది. ఇప్పుడు మరో ప్రాజెక్టు పరిస్థితి కూడా ప్రమాదం అంచున ఉంది. కొమురం భీం జిల్లా లోని కొమురం భీం ప్రాజెక్టు ప్రమాదపుటంచుకు చేరుతోంది. ఇటీవలి వర్షాలకు కొమురం భీం ప్రాజెక్టు లోకి భారీగా వరద చేరింది. దీంతో వరద ఉధృతి కి ప్రాజెక్టు ఆనకట్ట చివరి భాగం దెబ్బతింది. రాళ్లు,మట్టి కొట్టుకు పోయి బలహీనంగా మారింది. నీటి తాకిడికి మెల్ల మెల్లగా కూలిపోతోంది. ఆనకట్టను పటిష్టం చేసేందుకు అవసరమైన నిధులు లేక ఇంజనీరింగ్ అధికారులు పాలిథిన్ కవర్లు తెప్పించారు. వరద తాకిడిని తట్టుకునేలా భారీ కవర్ ను దెబ్బతిన్న కట్టపై కప్పేశారు.
కొన్నాళ్లుగా ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇన్ ఫ్లో ఎంతో….అవుట్ ఫ్లో ఎంతో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గెస్ చేసి నీటి లెక్కలు పంపుతున్నారు. వరద ను లెక్కించే డైల్ గేజ్ వ్యవస్థ లేక పోవడంతో ప్రాజెక్టు పరిస్థితి దారుణంగా మారింది. మరీ దారుణం ఏమిటంటే ప్రాజెక్టు కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బిల్లులు చెల్లించకపోవడంతో ఏడాది కిందట కనెక్షన్ తొలగించారు. ఇప్పటి వరకు తిరిగి పునరుద్ధరించలేదు. దీంతో జనరేటర్ సహాయంతో గేట్లను ఎత్తి, దించుతున్నారు. ఈ క్రమంలో ఎగువ నుంచి భారీగా వరద వస్తే పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. భారీ వర్షంతో పాటు వరద ఎక్కువగా వచ్చినప్పుడు జనరేటర్ గనుక మొరాయిస్తే ప్రాజెక్టు తెగిపోయే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.
10 టీఎంసీల సామర్థ్యం తో ఈ ప్రాజెక్టు 10 ఏండ్ల కిందట నిర్మించారు. అప్పటి నుంచి నిర్వహణ గాలికొదిలేశారు. నిధులు లేక కాల్వలు నిర్మించలేదు. 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా, ఎక్కడా కూడా సక్రమంగా నీరివ్వలేదని స్థానికులు చెబుతున్నారు. చివరికి ప్రాజెక్టు ఆనకట్ట ను కూడా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి కడెం ప్రాజెక్టు అనుభవం తర్వాత కూడా ప్రాజెక్టు ల నిర్వహణ విషయం లో ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.