పదో తరగతి జవాబు పత్రాల మాయం
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో పదవ తరగతి జవాబు పత్రాల మాయం అయిన ఘటన కలకలం రేపింది. ఉట్నూర్ లో పరీక్ష రాయటానికి 1011 విద్యార్థులకు అధికారులు 5 సెంటర్లు ఏర్పాటు చేశారు.సోమవారం రాసిన పరీక్షకు సంబందించిన జవాబు పత్రాలు మాయం అయినట్లు గుర్తించారు. పిల్లలు పరీక్ష రాసిన తరువాత జవాబు పత్రాలకు సంబంధించి పోస్టు ఆఫీస్ నుంచి బస్టాండ్ కు తరలిస్తుండగా ఒక్క కట్ట జవాబు పత్రాలు మిస్ అయినట్లు గుర్తించారు.
జవాబు పత్రాల మాయం ఘటనలో పోస్ట్ మాస్టర్ హరీష్ ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాయమైన జవాబు పత్రాల కట్టలో సుమారు 30 మందికి సంబంధించిన ఆన్సర్ షీట్స్ ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. జవాబు పత్రాల మాయం పై పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అవి ఎక్కడ మిస్ అయ్యాయనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.
ఏ సెంటర్ సంబంధించిన జవాబు పత్రాలు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ అప్పగించిన తర్వాతే అవి మిస్ అయినట్లుగా విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. జవాబు పత్రాలు పడిపోయాయా..? లేక ఏమైంది..? నిర్లక్ష్యం ఎవరిది..? అనే దానిపై పోలీసుల విచారణ చేపట్టారు.