వేతన ఒప్పందంలో బీఎంఎస్ పెద్దన్న పాత్ర
-గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వం
-వత్తాసు పలుకుతున్న సింగరేణి యాజమాన్యం
-బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య

BMS:సింగరేణి కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం తీసుకురావడంలో భారతీయ మజ్దూర్ సంఘ్ కీలక భూమిక పోషించిందని, పెద్దన్న పాత్ర వహించిందని ఆ యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య స్పష్టం చేశారు. మంగళవారం రామగుండం ఏరియా IIIలో ALP, అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 11వ వేతన ఒప్పందంలో 19 శాతం మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్, 25% అలవెన్స్ లపై పెరుగుదల సాధించడంలో బీఎంఎస్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. కొత్త జీతభత్యాలు జూన్ నుండి అమలు చేసేందుకు బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్, జేబీసీసీఐ సభ్యుడు కొత్త కాపు లక్ష్మారెడ్డి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సంప్రదింపులు జరిపారని స్పష్టం చేశారు. కొత్త జీతాలు జూన్ నుంచి వచ్చేలా ఆదేశాలు జారీ చేయించిన ఘనత BMSకే దక్కుతుందని వెల్లడించారు.
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. అప్రజాస్వామిక పద్ధతి అనుసరిస్తోందని సత్తయ్య ఈ సందర్భంగా దుయ్యబట్టారు. సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి సుముఖంగా లేదన్నారు. ఈ విషయాలు కార్మికులంతా గమనిస్తున్నారని అన్నారు. రెండు సంవత్సరాల కాల పరిమితికి నాలుగు సంవత్సరాలుగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, తక్షణమే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంస్థ సాధించిన వాస్తవ లాభాలపైన 35% లాభాల వాటా చెల్లించాలని కోరారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏరియా ఉపాధ్యక్షులు అరుకాల ప్రసాద్, మామిడి స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో కేంద్ర ఉపాధ్యక్షుడు వై. సారంగపాణి, సెంట్రల్ ట్రెజరర్ పొన్నమనేని వేణుగోపాలరావు, కేంద్ర కమిటీ సభ్యులు మాదాసు రవీందర్, ఏరియా కార్యదర్శి మామిడి స్వామి , ఫిట్ కార్యదర్శి ఎం.సంపత్ తదితరులు పాల్గొన్నారు.