కార్మికుడిలా కేంద్ర‌మంత్రి

హైదరాబాద్ లో సింగరేణి సంస్థకు సంబంధించిన కీలక అంశాలపై సమీక్ష నిర్వ‌హించారు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి(G. Kishan Reddy). ఈ స‌మావేశానికి ఆయ‌న సింగ‌రేణి కార్మికుల నీలిరంగు యూనిఫామ్ ధరించి హాజ‌ర‌య్యారు. “తాను ఆ యూనిఫాంలో స‌మావేశానికి హాజరవడాన్ని గర్వంగా భావిస్తున్నానని వెల్ల‌డించారు. ఇది కేవలం యూనిఫామ్ మాత్రమే కాదు. ఇది సింగరేణి కార్మికుల చెమట చుక్కను ప్రతిబింబించే త్యాగం, వారి శ్రమ, ధైర్యం అంకితభావానికి ప్రతీక. బొగ్గు కార్మికుల సమస్యలపై ఏ సమావేశానికి వెళ్లినా ఆయా బొగ్గు కంపెనీల్లో కార్మికులు ధరించే యూనిఫామ్ ధరించే సాంప్రదాయాన్ని నిరంతరం కొనసాగిస్తున్నందుకు నాకెంతో సంతృప్తి కలుగుతుంది. దేశ ఇంధన భద్రతకు నిరంతరం అండగా నిలుస్తున్న ప్రతి సింగరేణి కార్మికుడికి నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు” అంటూ పేర్కొన్నారు.

బొగ్గు ఉత్పత్తి పెంపు, కొత్త గనుల సాధన, కోల్ గ్యాసిఫికేషన్, రవాణా వ్యవస్థ బలోపేతం, ఉద్యోగుల భాగస్వామ్యం వంటి అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. దేశ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని రానున్న 10 నుంచి 15 సంవత్సరాలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సింగరేణి యాజమాన్యానికి మంత్రి ఆదేశించారు. ఒడిశాలోని నైనీ బొగ్గు గని రవాణా సమస్యలు, అటవీ భూ సేకరణ అంశాల పరిష్కారానికి కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సింగరేణి గనుల ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపునకు సంబంధించిన వివరాలను కొత్త గనులు వాటి ఉత్పత్తి వివరాలు, అనుమతుల స్థితిగతులపై గనుల వారీగా కూలంకశంగా సమీక్షించారు.

నేటి పోటీ మార్కెట్ లో ప్రభుత్వ సంస్థలు నిలబడాలంటే నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవడంతోపాటు ప్రతీ ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాల‌న్నారు. కంపెనీ అభివృద్ధికి, సంస్కరణల అమలుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించుకోవాలన్నారు. సమష్టిగా సింగరేణి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని. సంస్థ అభివృద్ధికి తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి సింగరేణి లో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ప్రస్తుత సవాళ్లను వివరించారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంలో ఎదురవుతున్న పలు సవాళ్లను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా సింగరేణికి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ స్టేటస్ తొలగించడం వల్ల అటవీ భూ సేకరణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ అంశంపై అతి త్వరలోనే సానుకూల నిర్ణయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గనిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గు రవాణా విషయంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. సమావేశంలో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ కస్సి, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రైవేట్ సెక్రటరీ పంకజ్ జైన్, బొగ్గు శాఖ సలహాదారులు వీరా రెడ్డి, సింగరేణి డైరెక్టర్లు ఎల్ వి సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, ఎం.తిరుమలరావు, ఈడీ (కోల్ మూవ్మెంట్) బి.వెంకన్న, జీఎం(కో ఆర్డినేషన్, మార్కెటింగ్) శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like