ఈటల రాజేందర్‌కు ‘వై కేటగిరీ’ భద్రత
Etala Rajender:తన భర్త హత్యకు కుట్ర జరుగుతోందన్న ఈటల జమున వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఈటల రాజేందర్‌కు వై కేటగిరీ భద్రత కల్పించనుంది
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది. ఆయనను హతమార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈటలకు ‘వై కేటగిరీ’ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
అంతకుముందు ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈటల రాజేందర్‌ను రూ. 20 ఇచ్చి కోట్లు చంపిస్తానని కౌశిక్ రెడ్డి అంటున్నారని ఆమె వెల్లడించారు. కౌశిక్ రెడ్డి మాటల వెనక కేసీఆర్ ఉన్నారని జమున ఆరోపించారు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను రూ. 20 కోట్లు ఇచ్చి చంపిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ది చెబుతారని అన్నారు.